168 ఎలుకల కోసం 69 లక్షల ఖర్చు: నెటిజన్లు ఏమన్నారంటే!
మొత్తానికి దేశంలో ఎలుకల వ్యవహారం.. అన్ని ప్రభుత్వ శాఖలకు కలిసి వస్తోందని మరింత మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
By: Tupaki Desk | 19 Sep 2023 3:30 PM GMTరైల్వే శాఖ అంటే.. అంతో ఇంతో ఆర్థిక క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకొంటారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికీ పక్కా లెక్క ఉంటుందని.. ఒక్క రూపాయి తేడా వచ్చినా.. ఉన్నతస్థాయిలో తాట రేగుతుందనే చర్చ కూడా రైల్వే శాఖలో తరచుగా వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం.. రైల్వే చట్టాలు బలంగా ఉండడం.. అంతకు మించి కఠినంగా కూడా ఉండడమేనని చెబుతారు.
అందుకే.. ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎక్కడో ఒక చోట అవినీతి ఆనవాళ్లు పుంఖాను పుంఖాలుగా బయట పడినా.. రైల్వేలో మాత్రం పెద్దగా అవినీతి చోటు చేసుకున్న పరిస్థితులు ఎప్పుడు వినలేదు..కనలేదు కూడా. అయితే..తాజాగా వెలుగు చూసిన ఓ వార్త.. సంచలనం రేపుతోంది. రైళ్లలోని రిజర్వ్‌డ్ బోగీల్లో ముఖ్యంగా ఏసీ బోగీల్లో.. ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారిన ఎలుకల నివారణ అంశం.. ఇప్పుడు రైల్వేను కుదిపేస్తోంది.
ప్రధాన రైళ్లయినా.. రాజధాని సహా ఇతర రైళ్లలోని ఏసీ బోగీల్లో తిరుగాడుతూ.. ప్రయాణికులను ఇబ్బందుల కు గురి చేస్తున్న ఎలుకలను పట్టుకునేందుకు రైల్వే శాఖ చేసిన ఖర్చుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రైల్వే లెక్కల ప్రకారం.. 168 ఎలుకలను ఈ ఏడాది ఇప్పటి వరకు పట్టుకున్నారు. అయితే.. దీనికి గాను చేసిన ఖర్చు ఏకంగా.. 69 లక్షల రూపాయలు అని తేల్చి చెప్పింది. అంతే.. ఈవార్త ఇలా బయటకు రాగానే నెటిజన్లు అలా ఫైరయ్యారు.
168 ఎలుకలను పట్టుకునేందుకు 69 లక్షల రూపాయల ప్రజాధనాన్ని బొక్కేస్తారా? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ఎటు పోయాయి? అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ఎలుకల పేరుతో ప్రజా సొమ్మును కొట్టేసిన.. వారిని బయటకు లాగాల్సిందేనని ఉత్తరాది పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మొత్తానికి దేశంలో ఎలుకల వ్యవహారం.. అన్ని ప్రభుత్వ శాఖలకు కలిసి వస్తోందని మరింత మంది నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
ఎలుకలు చేసిన పనులు ఇవేనట..!
+ 2 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని.. కొన్ని రోజుల కిందట బిహార్ పోలీసులు కోర్టు కు చెప్పారు.
+ రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న తమిళనాడు పోలీసులు.. కోర్టుకు 50 గ్రాములు సమర్పించి.. చేతులు దులుపుకొన్నారు. మరి మిగిలిన గంజాయి ఏమైందంటే.. ఎలుకలు తినేశాయని సమాధానం చెప్పారు.
+ 12 మంది హత్యకు కారణమైన ఒక ఉన్మాది కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఆధారాలను చింపేశారనే అభియోగంపై సదరు ఆధారాలను ఎలుకలు తినేశాయని కోర్టుకు చూపించారు.
+ ఇక ఇప్పుడు.. 168 ఎలుకల కోసం 69 లక్షల రూపాయలను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశామని రైల్వే చెబుతున్నా.. ఇది పెద్ద అధికారుల జేబుల్లోకి వెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి.