Begin typing your search above and press return to search.

3 గంటల మాయదారి వర్షం హైదరాబాద్ ను ముంచెత్తింది

పంద్రాగస్టు సందర్భంగా సెలవు రోజు సాయంత్రాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి చుక్కలు కనిపించాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 5:14 AM GMT
3 గంటల మాయదారి వర్షం హైదరాబాద్ ను ముంచెత్తింది
X

గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లోని లక్షలాది మంది కొత్త తరహా వాతావరణాన్ని చవిచూస్తున్నారు. చెమటతో ఉక్కిరిబిక్కిరి కావటం.. వాతావరణంలో ఒకలాంటి వేడి చిరాకును తెప్పించింది. తపనతో పాటు.. చల్లటి వాతావరణం కోసం తపించిన పరిస్థితి. వాతావరణంలోని తేమదనంలో వచ్చిన మార్పుతో హైదరాబాదీయులు తెగ ఇబ్బంది పడ్డారు. మారిన వాతావరణానికి చెక్ చెబుతూ వరుణుడు ఎంట్రీ ఇచ్చారు. పంద్రాగస్టు సందర్భంగా సెలవు రోజు సాయంత్రాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి చుక్కలు కనిపించాయి.

దీనికి తోడు శుక్రవారం వరలక్ష్మి వత్రం కావటం.. రెండో శుక్రవారం కావటంతో షాపింగ్ కోసం.. పూజ సామాన్ల కోసం షాపులకు వెళ్లిన ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన వర్షం కాసేపటికే మహానగరం మొత్తం విస్తరించింది. దగ్గర దగ్గర మూడు గంటల పాటు దంచికొట్టిన వానతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోత కారణంగా వందలాది కాలనీలు ఎప్పటిలానే ముంపునకు గురయ్యాయి.

భారీ వర్షం కారణంగా రోడ్ల మీద వర్షపునీరు పెద్ద ఎత్తున నిలిచింది. హైదరాబాద్ మహానగరంలో బన్సీలాల్ పేట లో 8.7సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పాటిగడ్డలో 8.5 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 8.3 సెంటీమీటర్లు.. ముషీరాబాద్ లో 8 సెంటీమీటర్లు ..బోలక్ పూర్ లో 7.3.. సికింద్రాబాద్ లో 7 సెంటీమాటర్లు.. అస్మాన్ ఘడ్.. హైదర్ నగర్.. యూసఫ్ గూడ.. బంజారాహిల్స్.. ఎల్బీ నగర్ లో 6 సెంటీమీటర్లకు పైనే వర్షం పడింది. ఇవే కాకుండా మియాపూర్.. కుకట్ పల్లి.. అమీర్ పేట.. ఖాజాగూడలో కురిసిన వర్షం తాకిడి ఎక్కువగా ఉంది.

శ్రావణ శుక్రవారం రెండో వారం ముందు రోజు కావటంతో.. సామాన్లు కొనుగోలు చేయటానికి పెద్ద ఎత్తున మార్కెట్లకు వచ్చారు. సరిగ్గా.. షాపింగ్ వేళలో వర్షం పడటంతో అటు వ్యాపారులు.. ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ ఎపిసోడ్ లో కాస్తంత రిలీఫ్ అంశం ఏమంటే.. సెలవు రోజు కావటం. ఒకవేళ.. పంద్రాగస్టు కాకుండా ఉంటే.. ఈ వర్షం తాకిడికి హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం ఆగమాగం అయ్యేది. ఇళ్లకు ఏ అర్థరాత్రో చేరుకునే వారు. భారీగా పడిన వర్షానికి చాలా కాలనీల్లో రెండు గంటల పాటు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఎప్పటిలానే ఈ భారీ వర్షానికి కార్లు.. టూవీలర్లు వరద ప్రవాహ కొట్టుకెళ్లాయి. భారీ వానతో జాతీయ రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్ మేయర్ ఒక ప్రకటన చేస్తూ.. మరీ అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దన్న సూచన చేయటం చూస్తే.. వాన తీవ్రత ఎంత ఎక్కువన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.