వానలు వచ్చేశాయి.. మరో 3 రోజులు వర్షాలే
జూన్ లో రావాల్సిన వర్షాలు నెలన్నర ఆలస్యంగా వచ్చాయి. మంచి వర్షాలు పడాల్సిన వేళలో
By: Tupaki Desk | 19 July 2023 5:18 AM GMTజూన్ లో రావాల్సిన వర్షాలు నెలన్నర ఆలస్యంగా వచ్చాయి. మంచి వర్షాలు పడాల్సిన వేళలో.. మండే ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే. జూన్ మొదటి వారంలో పడాల్సిన వానలు.. రోజులు గడుస్తున్నా.. వరుణుడు పత్తా లేకుండా పోవటం.. వాతావరణం వేడిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జూన్ లో ఇలాంటి వాతావరణం ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదైంది లేదు. క్యాలెండర్ లో జులై వచ్చేసినప్పటికీ వానల జాడ లేకపోవటంపై ఆందోళన మొదలైంది.
ఇదిలా ఉండగా ఆదివారం నుంచి మొదలైన వానలు.. సోమవారం కంటిన్యూ అయ్యాయి. మరో మూడు రోజుల పాటు వాతావరణం కూల్ కూల్ గా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం వర్షాలు విస్తారంగా పడితే.. ఏపీలో మాత్రం ఒక మోస్తరుగా నమోదయ్యాయి. ఏపీ వ్యాప్తంగా చూస్తే..సోమవారం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా వర్షాలు పడ్డాయి. మిగిలిన చోట్ల చెదురుమొదురుగా వర్షాలు పడ్డాయి.
ఇందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైంది. ఆకాశాన్ని మేఘాలు దట్టంగా కమ్మేసి.. రోజు మొత్తం వర్షం పడుతూనే ఉండటం గమనార్హం. కాకుంటే.. జోరున కాకుండా ఆగి.. ఆగి పడటం.. సన్నటి జల్లులతో సీజన్ లోనే అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
సోమవారం ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో గరిష్ఠంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిజామాబాద్.. సిరిసిల్ల.. కరీంనగర్.. హనుమకొండ.. భూపాలపల్లి.. ములుగు జిల్లాల్లో భారీగా.. ఖమ్మం.. నాగర్ కర్నూలు.. గద్వాల.. మహబూబ్ నగర్.. వనపర్తి.. నారాయణపేట జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ మహానగరం మొత్తం ఆదివారం నుంచి సన్నటి జల్లుల మొదలు ఒక మోస్తరు వర్షం పాతం కంటిన్యూగా పడుతూనే ఉండటం గమనార్హం.
వాస్తవానికి ఈ సీజన్ లో మంగళవారం నాటికి 25.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 21.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. ఇప్పటికి 14 శాతం లోటు ఉంది. మొత్తం జిల్లాల్లో 19 జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మరో 14 జిల్లాల్లో వర్షపాతం నమోదులో కొరత ఉందని చెప్పాలి.
ఏపీ విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పాతపట్నం.. పలాస.. మందసలో 3 సెంటీమీటర్లు.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 2.5, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే.. సోమవారం వర్షం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా పడింది.
రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఉత్తర కోస్తా.. యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే.. ఆసిఫాబాద్.. నిజామాబాద్.. కొత్తగూడెం.. ఖమ్మం..యాదాద్రి.. వికారాబాద్.. సంగారెడ్డి.. మెదక్.. కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని.. అదిలాబాద్.. మంచిర్యాల.. నిర్మల్.. జగిత్యాల.. సిర్పూర్.. కరీంనగర్.. పెద్దపల్లి.. మహబూబాబాద్.. వరంగల్.. హన్మకొండ.. జనగామ.. సిద్దిపేట.. రంగారెడ్డి.. హైదరాబాద్.. మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా బుధ..గురు.. శుక్రవారాలు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అవకాశముంది.