వర్షాలపై కీలక అప్టేట్.. ఈసారి ఎప్పుడు ఎంట్రీ అంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు అల్లాడిపోతున్నారు.
By: Tupaki Desk | 14 May 2024 4:43 AM GMTతెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు కొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఎండల ధాటికి కుదేలవుతున్న వారికి నిజంగా ఇది చల్లని వార్తే. ఈనెల 19కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది.
దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు ద్రోణి ప్రభావం ఏర్పడింది. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, క్రిష్ణ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.
రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ సారి వర్షాలు ముందే రానుండటంతో రైతుల్లో కూడా సంతోషం కలుగుతోంది.
అత్యధికంగా ప్రకాశం జిల్లా ఐల్లిపల్లిలో 79 మి.మీ. వర్షపాతం నమోదైంది. వేడి గాలుల నేపథ్యంలో చల్లటి వర్షాలు ఊరటనిస్తున్నా రైతులకు మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి. సోమవారం ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. వేసవిలో వాతావరణ శాఖ మాత్రం మంచి కబురు పంపడంతో అందరు సంతోషిస్తున్నారు.