Begin typing your search above and press return to search.

అయోధ్య రామాలయంలోకి వర్షపు నీరు.. నిర్మాణ లోపమే కారణం!

మరో షాకింగ్ అంశం ఏమంటే.. వర్షపు నీరు బయటకు వెళ్లటానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 5:44 AM GMT
అయోధ్య రామాలయంలోకి వర్షపు నీరు.. నిర్మాణ లోపమే కారణం!
X

షాకింగ్ నిజం వెలుగు చూసింది. తాజాగా అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయంలోని గర్భాలయంలోకి వర్షపు నీరు లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పిన వేళ.. అందుకు భిన్నంగా ఆలయం ప్రారంభమైన తర్వాత కురిసిన మొదటి భారీ వర్షంతో నిర్మాణ లోపాలు వెలుగు చూడటంపై ఆలయన ప్రధాన పూజారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శనివారం అయోధ్యలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం తీవ్రతకు అయోధ్య గర్భగుడిలో బాలరాముడ్ని పూజించే పూజారులు కూర్చునే చోటుతో పాటు వీఐపీ భక్తులు వచ్చే దారిలోనూ వర్షపు నీరు లీక్ అవుతున్న విషయాన్ని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ స్పందించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షపు నీరు లీక్ కావటాన్ని ఆయన తప్పు పట్టారు.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. వర్షపు నీరు బయటకు వెళ్లటానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేకపోవటాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్న ఆయన మాటలు ఇప్పుడు షాకిచ్చేలా మారాయి. కారణం.. ఈ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఇంజనీర్లు.. అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆలయం ప్రారంభమైన తొలి వర్షానికే లీక్ కావటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

భారీ భూకంపాన్ని సైతం తట్టుకునేలా వెయ్యేళ్లు అయినా చెక్కుచెదరని రీతిలో నిర్మాణం చేశారంటూ.. భారీ కథనాలు ఈ ఆలయ ప్రాణప్రతిష్ఠ సమయంలో పబ్లిష్ కావటం తెలిసిందే. అలాంటి ఆలయంలో వర్షపు నీరు లీక్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతో అనుభవం ఉన్న ఇంజనీర్లు కట్టినప్పటికీ ఇలా వర్షపునీరు లీక్ కావటం పెద్ద తప్పే అంటూ ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ న్రపేంద్ర మిశ్రా పేర్కొన్నారు.

లీక్ గురించి తెలిసినంతనే ఆలయానికి చేరుకున్న ఆయన.. తక్షణం మరమ్మత్తులకు ఆదేశించారు. ఆలయం మొదటి అంతస్తు పనులు ఇంకా పూర్తి కాలేదని.. జూలై నాటికి పూర్తి అవుతాయని పేర్కొన్నారు. ఈ డిసెంబరునాటికి నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఏమైనా.. ఐకానిక్ టెంపుల్ గా వ్యవహరిస్తున్న అయోధ్య ఆలయానికి లీకేజీ బెడద షాకింగ్ గా మారింది.