ఆర్టీసీ బిల్లుపై రాజ్ భవన్ వివరణ ఇది... వాట్ నెక్స్ట్?
By: Tupaki Desk | 4 Aug 2023 2:22 PM GMTగతంలో తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అనే చర్చ సాగిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో పరస్పర విమర్శలు, ఫిర్యాదుల వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే ఇటీవల కాలంలో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య కొంత సుహృద్భావ వాతావరణం ఉన్నట్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ప్రగతి భవన్ కి ఢిల్లీ కంటే రాజ్ భవనే దగ్గర అంటూ తనపై ఫిర్యాదుల సమయంలో గవర్నర్ తమిళ సై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొంతకాలం సైలంటుగా ఉన్న ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణమైంది... టీ.ఎస్.ఆర్టీసీ బిల్లు!
ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇటీవల ఆయన అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ సర్కార్ బిల్లును రూపొందించింది.
ఈ క్రమంలో... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు పంపించింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర కేబినేట్ రూపొందించిన ఈ బిల్లును యుద్ధ ప్రాతిపదికన రెండు రోజుల క్రితమే ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపింది. అయితే తాజాగా ఈ బిల్లుపై రాజ్ భవన్ స్పందించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్ భవన్ పెండింగ్ ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకనటలో వెల్లడించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే బిల్లుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వనట్లయ్యింది.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. 2వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకే రాజ్ భవన్ కు బిల్లు చేరిందని అంటున్నారు. అయితే ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.
మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు శనివారంతో ముగిస్తుండటంతో ఇప్పటి వరకు ఈ బిల్లుపై ఎటువంటి స్పష్టత రాకపోవడంతో... బీఆరెస్స్ వర్గాలు ఫైరవుతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే బిల్లు పంపి రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.
మరి శనివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి కాబట్టి... ఆలోపు గవర్నర్ ఆమోదం తెలుపుతారా.. లేక, గవర్నర్ ఆమోదం కోసం వేచి చూసే క్రమంలో ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ ని పొడిగిస్తుందా అనేది వేచి చూడాలి.