బీజేపీలో 'ఎమ్మెల్సీ' టికెట్ చిచ్చు.. రాజా వారి ఆగ్రహం!
తాజాగా మాత్రం తెలంగాణ బీజేపీ సారథి, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించారు. మీకు గులాం గిరీ చేసేవారికే టికెట్లు.. పదవులు ఇస్తారా? అంటూ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 4 April 2025 9:45 AMఇటీవల కాలంలో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ నాయకుడు, ఘోషా మహల్ వివాదాస్పద ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు.. ఆయన పలువురు నేతలను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేసినా.. ఎప్పుడూ బయట పడలేదు. కానీ, తాజాగా మాత్రం తెలంగాణ బీజేపీ సారథి, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించారు. మీకు గులాం గిరీ చేసేవారికే టికెట్లు.. పదవులు ఇస్తారా? అంటూ వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, ఆర్ ఎస్ ఎస్‌కు విధేయుడిగా పేరు తెచ్చుకున్న ఎస్. గౌతమ్‌రావును కేంద్రంలో పెద్దలు ప్రకటించారు. నామినేషన్ల గడువు శుక్రవారం(ఏప్రిల్ 4)తో ముగియనున్న నేపథ్యంలో చివరి నిముషంలో ఆయన పేరును ప్రస్తావించారు. అయితే.. అనేక మంది నాయకుల పేర్లు కూడా పరిశీలనకు వెళ్లినట్టు తెలిసింది. వీరిలో ఎస్సీ... బీసీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు.
ఇప్పుడు ఇదే విషయాన్ని కార్నర్ చేసుకుని రాజా సింగ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న గౌతమ్‌రావు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో రాజా సింగ్ నోటికి పనిచెప్పారు. ``మీ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థే మీకు కావాలా? పార్టీ కోసం పనిచేసిన వారు.. పోలీసులతో దెబ్బలు తిన్నవారు.. పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నవారు మీకు కనిపించలేదా?`` అని నిలదీశారు.
పార్టీలో గులాం గిరీ చేసేవారికే పదవులు.. పీఠాలు దక్కుతున్నాయని అనేందుకు గౌతంరావుకు టికెట ఇవ్వడమే నిదర్శమని రాజా సింగ్ విమర్శించారు. ``మీ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో అనేక మంది నాయకులు ఉన్నారు. వారంతా పార్టీ కోసం రోడ్డెక్కిన వారే..అయినా.. వారిని కనీసం పరిశీలించ లేదు. మీకు అడుగులకు మడుగులు వత్తే వారే కావాలా?``అని రాజా సింగ్ అన్నారు. ఇదిలావుంటే..ఈ నెల 25 న ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఒకే ఒక్క స్థానానికి ఈ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.