బీజేపీకి అలక ‘రాజా’ బై.. బై..?
బీజేపీపై అలకబూనిన రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కావడంలేదు.
By: Tupaki Desk | 14 Feb 2025 9:42 AM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేస్తాం అన్నంత ఊపు తెచ్చుకున్న తెలంగాణ బీజేపీకి త్వరలో పెద్ద కుదుపు ఎదురవనుందా..? మొన్న మిస్సయింది.. వచ్చేసారి మాత్రం మాదే సీఎం పీఠం అంటున్న కాషాయ పార్టీకి అసలు సిసలు కమలం నేత గుడ్ బై కొట్టబోతున్నారా? హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీలో గుర్తింపు దక్కడం లేదనే ఆవేదనలో ఉన్న నాయకుడు కమలం గూటిని వీడనున్నారా? వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔననే అనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ లో 2014 నుంచి బీజేపీ గెలుస్తున్న సీటు గోషామహల్. పాత బస్తీతో కొంత కలిసి ఉండే ఈ స్థానంలో రాజాసింగ్ బలమైన నేతగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు గెలిచారు. స్థానిక ప్రత్యర్థి మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచారు. అయితే, 2023 ఎన్నికల్లో గెలిచన తర్వాత తనకు బీజేపీ శాసన సభా పక్ష నేత పదవి వస్తుందని ఆయన ఆశించారు. ఆ తర్వాత పార్టీ పదవిపైనా ఆశ పెట్టుకున్నారని చెబుతున్నారు. కానీ, రాజాసింగ్ కు ఉన్న ప్రతికూలతల రీత్యా పార్టీ ఆయన ఆశలను నెరవేర్చలేదు.
కీలక సమావేశాలకూ దూరం
బీజేపీపై అలకబూనిన రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసెంబ్లీకి కూడా హాజరు కావడంలేదు. మరోవైపు ఆయన కొన్నాళ్లు అసలు కనిపించనే లేదు. తాజాగా రాజాసింగ్ తెరపైకి వచ్చారు. 2014 నుంచి వేధింపులు భరిస్తున్నానని, ఇక తనవల్ల కాదని అన్నారు. ‘‘పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్లిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీలకు ఇవ్వాలని తాను కొన్ని పేర్లు ఇవ్వగా.. వారిని కాదని ఎంఐఎంతో తిరిగే వారికి ఇచ్చారని ఆరోపించారు. పార్టీలోని కీలక నేతకు ఫోన్ చేసి ఇదే అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారని...దీంతో తనపై దాగి ఉన్న కుట్ర కోణం బయటపడిందని పేరొకనానరు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తో యుద్ధం చేసినవాడినని, సొంత పార్టీలోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం అని అన్నారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇస్తారని, కానీ, తన సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలి. వెంటనే అధ్యక్షుడిని మార్చాలిని రాజింగ్ డిమాండ్ చేశారు. ధర్మ ప్రచారం, ధర్మ యుద్ధం నేర్చుకున్నానని, పార్టీలో కొందరు అనుసరిస్తున్నట్లు బ్రోకరిజం నేర్చుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. వారి వల్లనే ఈ రోజు పార్టీ వెనుకబడింది. వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ భాజపా ప్రభుత్వం రాదు’’ అని వ్యాఖ్యానించారు.