ఏపీలో ''రాజధాని ఫైల్స్'' కాక... హైకోర్టులో జరిగిందిదే!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సినిమాల హంగామా రసవత్తరంగా మారింది
By: Tupaki Desk | 14 Feb 2024 5:59 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సినిమాల హంగామా రసవత్తరంగా మారింది. నిన్నటివరకూ ఆర్జీవీ "వ్యూహం" సినిమా విడుదలపై తీవ్ర సందిగ్ధత, అంతకు మించిన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో "రాజధాని ఫైల్స్" పేరుతో తీసిన సినిమాపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో... ఏపీ హైకోర్టుల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుందనేది ఆసక్తిగా మారింది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ మూవీస్ సందడీ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా "రాజధాని ఫైల్స్" సినిమా విడుదలను నిలువరించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిపింది. ఈ సమయంలో... ఈ సినిమా విడుదలపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయమై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఉత్తర్వులు జారీచేశారు.
రాజధాని ఫైల్స్ సినిమాపై అభ్యంతరాన్ని తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించిన లేళ్ల అప్పిరెడ్డి... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని ఆరోపిస్తూ... సెన్సార్ బోర్డు జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని అప్పిరెడ్డి ఉన్నతన్యాయస్థానాన్ని కోరారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆరెన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు.
ఇందులో భాగంగా ఈ సినిమాలో ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే కొడాలి నాని, తదితరులను కొన్ని పాత్రలు పోలి ఉన్నాయని. అధికార వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించారని అన్నారు. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా నిర్మాణం జరిగినట్లు తెలుస్తుందని.. ఈ క్రమంలో ఈనెల 15న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రదర్శనను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలోనే పిటిషనర్ కోరినట్లు ఈ సినిమా విడుదలను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులిచ్చే విషయమై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఉత్తర్వులు జారీచేశారు.
మరోపక్క... ఈ సినిమా నిర్మాతల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా.. ఈ సినిమాని పరిశీలించిన కమిటీ కొన్ని సన్నివేశాల తొలగింపునకు సూచించగా, ఆ విషయంపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని అన్నారు. ఆ కమిటీ సూచించిన మేరకు కొన్ని సన్నివేశాలను ఇప్పటికే తొలగించినట్లు తెలిపారు. దీంతో ఈ విషయంపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఆసక్తిగా మారింది.