Begin typing your search above and press return to search.

వ్యాలిడ్‌ పాయింటే కదా.. కేసీఆర్‌ కు అవసరమా?

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   29 July 2024 10:00 AM GMT
వ్యాలిడ్‌ పాయింటే కదా.. కేసీఆర్‌ కు అవసరమా?
X

‘పదవులు ఉంటేనే అసెంబ్లీకి వస్తాం’.. అన్నట్టు మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ తీరు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడాక జరిగిన శాసనసభ సమావేశాలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్టుమని రెండు రోజులు కూడా హాజరైంది లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా అయితేనే శాసనసభకు వస్తాననేలా ఆయన తీరు ఉందని అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని.. గుర్తిస్తేనే అసెంబ్లీకి హాజరవుతాననేలా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తీరు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్‌ కు ఆదేశాలివ్వాలని జగన్‌ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ తీరుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీకి రాని ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని నిలదీశారు.

కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని తాము కోరుతున్నామని రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ సభకు ఎందుకు రావట్లేదని అడిగితే.. కేసీఆర్‌తో మాట్లాడే స్థాయి తమది కాదంటున్నారని మండిపడ్డారు. సభకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవచ్చు కదా అని నిలదీశారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని అప్పుల్లోకి నెట్టేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. అప్పుల నుంచి విద్యుత్‌ రంగాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పుల గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనపు విద్యుత్‌ ను యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి గుర్తు చేశారు. రామగుండంలో పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉంటే అక్కడ కాకుండా యాదాద్రిలో ఎందుకు నిర్మించారని నిలదీశారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ విద్యుత్‌ అవకతవకలపై కమిషన్‌ వేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తెలిపారు . యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ లాభదాయకం కాదని 2018లోనే తాను చెప్పానని గుర్తు చేశారు. ఈ ప్లాంట్‌ పూర్తయ్యేందుకు అదనంగా రూ.11 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అయినా ప్లాంట్‌ పూర్తి కాలేదని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కేసీఆర్‌ కు ప్రతిపక్ష నేత ఎందుకని.. ఈ హోదాను హరీశ్‌ రావు తీసుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కోమటిరెడ్డి సైతం అవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.