Begin typing your search above and press return to search.

హరీశ్ కు ఓపెన్ ఆఫర్.. పాపాలు కడుక్కోవటానికి దేవాదాయ శాఖ!

మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని సీన్లు కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే కనిపిస్తాయి.

By:  Tupaki Desk   |   13 Feb 2024 4:40 AM GMT
హరీశ్ కు ఓపెన్ ఆఫర్.. పాపాలు కడుక్కోవటానికి దేవాదాయ శాఖ!
X

మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కనిపించని సీన్లు కొన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే కనిపిస్తాయి. తొమ్మిదిన్నరేళ్ల గులాబీ పార్టీ ఏలుబడిలో పేరుకు ఉప ముఖ్యమంత్రులు.. మంత్రులు ఉన్నప్పటికి అందరూ ఏదో బిగుసుకుపోయినట్లుగా ఉండేవారు. రేవంత్ ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ కనిపించటమే కాదు.. ప్రభుత్వం అంటే ఇలా కదా? ఉండాల్సిందన్నట్లుగా ఉంది. కీలక స్థానాల్లో ఉన్న వారు సమయానికి తగ్గట్లు స్పందించటం.. మంత్రులుగా ఉన్న వారు అసలుసిసలు మంత్రులుగా వ్యవహరించటం మొదలు.. ప్రభుత్వంలో ఒకలాంటి ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇలాంటివేళ.. బీఆర్ఎస్ ముఖ్యనేత.. మాజీ మంత్రి హరీశ్ రావుకు అదిరే ఆఫర్ ఇచ్చేశారు కాంగ్రెస్ నేత కం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబీల్లో చిట్ చాట్ గా మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ లో ఉన్న హరీశ్ రావుకు మంత్రి పదవిని ఇస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ కు ఏంటి.. మంత్రి పదవి ఏమిటన్న సందేహం రావొచ్చు. కానీ.. అసలు పాయింట్ వేరే ఉంది.

హరీశ్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తీసుకుంటామని.. కేసీఆర్ సర్కారులోఆయన చేసిన తప్పుల్ని కడుక్కోవటానికి దేవాదాయ శాఖా మంత్రి పదవిని ఇస్తామని చెప్పిన ఆయన అందుకు ఒక కండీషన్ పెట్టారు. హరీశ్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కడిగా కాకుండా పాతిక మంది ఎమ్మెల్యేలతో వస్తే మంత్రి పదవిని ఇస్తామంటూ ట్విస్టు ఇచ్చారు. రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హరీశ్ కు అదిరే ఆఫర్ ఇవ్వటమే కాదు.. ఆయన్ను టార్గెట్ చేసి ఘాటుగా వ్యాఖ్యానించారు.

హరీశ్.. కడియం మాదిరి తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని.. పదవుల కోసం పాకులాడే వాళ్లం కాదన్న ఆయన.. ప్రజల కోసం ఉండేవాళ్లమని పేర్కొన్నారు. ‘‘ఉద్యమ సమయంలో పదవులను వదులుకున్న చరిత్ర మాది. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలి. కాంగ్రెస్పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారు. గతంలో మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారు. ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాపై పడింది’’ అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ సభకు జనం వచ్చే అవకాశం లేదని.. అట్టర్ ప్లాప్ అవుతుందని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కేటీఆర్ పార్టీని నడపాలన్న రాజగోపాల్ రెడ్డి.. హరీశ్ కు మాత్రం కితాబులు ఇవ్వటం గమనార్హం. హరీశ్ కష్టపడతారని అందుకే ఆయన్ను తమ పార్టీలోకి రమ్మంటున్నట్లు చెప్పిన ఆయన.. ‘హరీశ్ కు ఆ పార్టీలో భవిష్యత్ లేదు’ అంటూ ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు గులాబీ కోటలో కొత్త ప్రకంపనలకు కారణమవుతున్నట్లుగా చెబుతున్నారు. మరి.. రాజగోపాల్ రెడ్డివ్యాఖ్యలకు హరీశ్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.