Begin typing your search above and press return to search.

దోమల మీద దండయాత్ర : బాబు పుణ్యం...ఖైదీలు ధన్యం !

అలాగే రాజమండ్రి జైలులోని అనేక మంది ఖైదీలు వైరల్ ఫీవర్ తో అవస్థలు పడుతున్న విషయాలు ఇపుడు బయటకు వచ్చాయి

By:  Tupaki Desk   |   28 Sep 2023 11:30 AM GMT
దోమల మీద దండయాత్ర : బాబు పుణ్యం...ఖైదీలు ధన్యం !
X

రాజమండ్రి జైలులో ఖైదీలకు చంద్రబాబు పుణ్యమాని దోమల బెడద తప్పింది అంటున్నారు. రాజమండ్రిలోనే దోమలు చాలా ఉన్నాయని అప్పట్లో అంటే సరిగా ఆరేడేళ్ల క్రితం దోమల మీద దండయాత్ర పేరుతో సీఎం హోదాలో బాబు వచ్చి అన్న మాటలు ఈ రోజుకీ నిజాలే. మొత్తం ఊరులోనే దోమలు ఉంటే ఇక జైలు పరిసరాలలో తిష్ట వేసుకోవా. ఇపుడు అదే జరుగుతోంది.

జైలులో దోమల గురించి బాబు రిమాండ్ ఖైదీగా వచ్చాకనే బయట ప్రపంచానికి తెలిసింది. దోమలు బాబు గారిని కొట్టేస్తున్నాయని ఆయన సతీమణి భువనేశ్వరితో పాటుగా చాలా మంది టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. వీవీఐపీ అయిన బాబుకు ఇదేనా సదుపాయం అని మండిపడ్డారు. మరో వైపు చూస్తే ఇదే జైలులో డెంగ్యూ వ్యాధితో ఇటీవల ఒక ఖైదీ మరణించడం కూడా అతి పెద్ద చర్చకు దారితీసింది.

అలాగే రాజమండ్రి జైలులోని అనేక మంది ఖైదీలు వైరల్ ఫీవర్ తో అవస్థలు పడుతున్న విషయాలు ఇపుడు బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారం కాస్తా రాజకీయ రచ్చగా మారింది. దోమల వల్ల బాబు నానా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేతలు అంటూంటే దోమల వల్ల బాబుకు ఏమీ కాదని వాటికే ఆయన వల్ల ఏమైనా అపాయం అని వైసీపీకి చెందిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీ వేదికగా సెటైర్లు వేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా రాజమండ్రి జైలు పరిసరాలలో దోమలు రాకుండా వాటిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ఫాగింగ్ చేయించడం విశేషం. ఈ జైలు చుట్టుపక్కన భారీ ఎత్తున చెట్టు పుట్టలు, పొదలు ఉన్నాయి. వాటి వల్లనే పెద్ద ఎత్తున దోమలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. దీంతో విపక్షాలా విమర్శల సంగతి ఎలా ఉన్నా దోమలను నిర్మూలించాలని జైలు అధికారులు నిర్ణయించడం పట్ల ఖైదీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ దోమలతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని అయితే ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని అంటున్నారుట. ఇక చంద్రబాబు కోసం అయినా ఫాగింగ్ చేయడంతో తమకు ఊరట కలిగిందని అంటున్నారు. అయితే ఖైదీల బంధువులు మాత్రం బాబువి మాత్రమే ప్రాణాలా, మామూలు ఖైదీలవి కావా అని నిలదీస్తున్నారు. గతంలోనే ఈ ఫ్యాగింగ్ చేయించి ఉంటే చాలా మంది ఖైదీలు జ్వరాల బారిన పడకుండా ఉండే అవకాశం ఉండేది కదా అని కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తాము ఖైదీల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని రాజమండ్రి జైలు అధికారులు చెబుతున్నారు. అందుకే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఫాగింగ్‌ కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు వివరించారు.

ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలోని జైళ్ళను కూడా శ్రద్ధగా మంచిగా చూసుకోవడం అధికారంలో ఉన్న వారి బాధ్యత అంటున్నరు. ఎపుడు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ వీఐపీ జైలు బాట పడతారో తెలియదు కాబట్టి జైళ్ళను కూడా చక్కగా చూసుకుంటే ఎవరు అరెస్ట్ అయినా వీవీఐపీలకు సదుపాయాలు అక్కడ కూడా బాగుంటాయని సాదర జనం సెటైర్లు వేస్తున్నారు.