టీడీపీలో పోటీ...ఆయనకు హ్యాపీ...?
జోగులు ఈసారి కూడా గెలిచి వస్తారన్న నమ్మకం ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 31 July 2023 4:05 AM GMTఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గం రాజాం. ఎన్నో రాజకీయ యుద్ధాల ను చూసిన సీటు ఇది. రాజాం 2009 దాకా జనరల్ సీటు. దాని పూర్వ రూపం పేరు ఉణుకూరు. అది టీడీపీకి కంచుకోట. కిమిడి కళా వెంకటరావు అయితే ఏకంగా అయిదు సార్లు ఇదే సీటు నుంచి గెలిచి ఎన్నో కీలక పదవులు అలంకరించారు.
అయితే బైఫరికేషన్ లో ఉణుకూరు పోయి రాజాం ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఏర్పడింది. దాంతో టీడీపీకి పట్టు తగ్గి కాంగ్రెస్ కి పెరిగింది. 2009లో మొదటిసారి కాంగ్రెస్ పక్షాన కోండ్రు మురళీ మోహనరావు గెలిచారు. 2014, 2019లలో కంబాల జోగులు గెలిచి సత్తా చాటారు. ఇక 2024లో ఆయన్ని ఓడించాలని టీడీపీ చూస్తోంది.
అందుకోసం కాంగ్రెస్ లో ఉన్న కోండ్రుని టీడీపీ లోకి తెచ్చారు. ఆయన సొంత బలానికి తోడు టీడీపీ ఓటు బ్యాంక్ ప్లస్ అయితే కంబాల ను ఓడించడం సులువు అన్నది ఒక లెక్క. అయితే ఇక్కడే తేడాలు కూడా ఉన్నాయి. ఈ సీటు లో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ప్రతిభా భారతికి 69 వేల దాకా ఓట్లు వచ్చాయి. అందులో ఆమె సొంత ఇమేజ్ తో వచ్చిన ఓట్లు కూడా సగం దాకా ఉంటాయని అంటున్నారు.
దాంతో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తన కుమార్తె గ్రీష్మకు రాజాం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అధినాయకత్వం వద్ద పట్టుబడుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను కాదని కోండ్రుని పోటీకి పెట్టినా 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారని, ఇపుడు తమకు చాన్స్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక కోండ్రుకు మాజీ మంత్రి కళా వెంకటరావు మద్దతు ఉంటే మాజీ స్పీకర్ కి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మద్దతు ఉంది అని అంటున్నారు.
ఈ ఇద్దరి లో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండవ వర్గం సహకరించదు అని అంటున్నారు. దాంతో రాజాం సీటు లో ఈసారి టీడీపీ కి కొంత అనుకూలంగా ఉందని భావించినా వర్గ పోరు మాత్రం ఆశల ను తగ్గించేస్తోంది అని అంటున్నారు. ఇక రెండు సార్లు గెలిచిన కంబాల జోగులు పట్ల వ్యతిరేకత అయితే ఉంది.
దాంతో ఒక దశలో ఆయన అభ్యర్ధిత్వాన్ని మార్చాలని వైసీపీ హై కమాండ్ ఆలోచించింది అని అంటున్నారు. అయితే టీడీపీ లో వర్గ పోరు చూసిన తరువాత జోగులు ఈసారి కూడా గెలిచి వస్తారన్న నమ్మకం ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం టీడీపీ లో సీటు కోసం జరుగుతున్న ఫైటింగ్ తో జోగులు ధీమాగా ఉన్నారని అంటున్నారు. మరి ఎన్నికల నాటికైనా రెండు వర్గాలు ఒక్కటిగా ఉంటే వైసీపీకి ప్రాబ్లం అవుతుంది. కానీ వాతావరణం మాత్రం అలా ఉన్నట్లుగా కనిపించడంలేదు అని అంటున్నారు.