రాజన్నదొర సీటు సేఫ్...!?
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అసెంబ్లీ శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరను ఈసారి అరుకు ఎంపీగా పంపిస్తారు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
By: Tupaki Desk | 4 Jan 2024 4:03 AM GMTపార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అసెంబ్లీ శాసనసభ్యుడు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరను ఈసారి అరుకు ఎంపీగా పంపిస్తారు ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్నదొరకు మరోసారి సాలూరు సీటు ఇచ్చే కంటే ఆయన్ని ఎంపీగా పోటీ చేయించి అక్కడ కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచించింది అని అంటూ వచ్చారు.
అయితే ఇపుడు చూస్తే పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పోటీ చేయించడానికి క్లారిటీ వచ్చింది. వైసీపీ విడుదల చేసిన రెండవ జాబితాలో కె భాగ్యలక్ష్మి పేరుని అరకు పార్లమెంట్ సీటుకు ఇంచార్జిగా ప్రకటించారు.
దాంతో రాజన్నదొరనే మళ్లీ సాలూరు నుంచి పోటీ చేయిస్తారా అన్న చర్చకు తెర లేస్తోంది. వాస్తవానికి సాలూరు వైసీపీలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా రాజన్నదొర కంటే బెస్ట్ చాయిస్ లేదని అంటున్నారు. ఆయనకే మరోసారి అవకాశం ఇస్తే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నారని అందుకే ఆయనను అలా కొనసాగించే వీలుంది అని అంటున్నారు.
అయితే మరో మాట కూడా వినిపిస్తోంది. రాజన్నదొర ప్లేస్ లో జీసీసీ చైర్ పర్సన్ స్వాతిని అభ్యర్ధిగా ప్రకటించి రాజన్న దొరకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వవచ్చు అన్నది ఒక ప్రతిపాదనగా ఉందని అంటున్నారు. జీసీసీ చైర్ పర్సన్ గా ఉంటున్న స్వాతిరాణి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ఇక టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి మరోసారి పోటీకి రెడీ అయ్యారు. ఆమె గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కొంత సానుభూతి వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. పైగా మరో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వర్గం కూడా సహకరించవచ్చు అని అంటున్నారు. దాంతో టీడీపీ నుంచి గట్టి పోటీ ఈసారి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో రాజన్నదొర ప్లేస్ లో మహిళా అభ్యర్ధిగా స్వాతిరాణిని తెచ్చి పోటీ చేయిస్తే మరోసారి సాలూరు వైసీపీ ఖాతాలో పడుతుంది అని అంటున్నారు.
దీనికి రాజన్నదొర కూడా అంగీకరిస్తే ఆయన సహకారం ఉంటే తప్పకుండా సాలూరులో వైసీపీ గెలిచి తీరుతుంది అని అంటున్నారు. మొత్తం మీద మూడవ జాబితాలో సాలూరు సహా ఉమ్మడి విజయనగరంలోని కొన్ని కీలకమైన స్థానాలలో మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.