Begin typing your search above and press return to search.

పవన్ తో సాన్నిహిత్యంపై రాజు రవితేజ కీలక వ్యాఖ్యలు!

రాజు రవితేజ వరుస ఇంటర్వ్యూ లలో పవన్ పై అడిగిన ప్రశ్నల కు ఇస్తున్న సమాధానాలు ఆసక్తికరంగా మారాయి!

By:  Tupaki Desk   |   24 July 2023 11:58 AM GMT
పవన్ తో సాన్నిహిత్యంపై రాజు రవితేజ కీలక వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. మరోవైపు వారాహి యాత్రతో పవన్ ఏపీ రాజకీయాల్లో హడావిడి సృష్టించిన తరుణంలో.. మరోపక్క వాలంటీర్ల పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పవన్ క్యారెక్టర్ పై సీఎం జగన్ నిప్పులు చెరిగిన సందర్భంలో... రాజు రవితేజ తో వరుసపెట్టి ఇంటర్వూలు చేస్తోంది మీడియా! ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి!

పవన్ కల్యాణ్ తో సుమారు 12 సంవత్సరాల పాటు నడిచిన వ్యక్తి, పవన్‌ కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ గురించి జనసైనికు లతో పాటు చాలామందికి పెద్దగా పరిచయం అక్కరలేదంటారు. ఈ సందర్భంగా ఆయన ఇస్తున్న వరుస ఇంటర్వ్యూలు.. ఆ ఇంటర్వ్యూలలో పవన్ పై అడిగిన ప్రశ్నల కు ఇస్తున్న సమాధానాలు ఆసక్తికరంగా మారాయి!

ఇందులో భాగంగా తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు రవితేజ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... పవన్ ఎంతగానో అభిమానించే చేగువేరా అంటే తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. చెగువేరా సిద్ధాంతాలు, రాజకీయాలు, పోరాటాలు భారతదేశం రాజకీయాల కు సూట్ కావని, అది మన చరిత్ర కాదని, అది ఈ దేశ సంస్కృతి కాదని తెలిపారు!

ఇదే సమయంలో... పవన్ కు తనకూ ఏనాడూ పెద్దగా విభేదాలు రాలేదని, పెద్దగా భారీస్థాయి లో డిస్కషన్స్ ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే తనలో ఆయనకు నచ్చని విషయాల ను నేరుగా చెప్పకుండా... సైకోటిక్ గా వ్యవహరించేవారని... పవన్ కు ఇంఫిర్యారిటీ కాంప్లెక్స్ ఎక్కువని సంచలన వ్యాఖ్యలు చేశారు! ఇదే సమయంలో ఇద్దరమూ పెద్దగా బయట తిరిగే వారం కాదని... వీలున్నప్పుడు కలిసేవారమని తెలిపారు!

అదేవిధంగా... బాగా సన్నిహితులు వద్ద, బాగా కావాల్సిన వారి వద్ద ఎప్పుడూ... చెప్పేదే చెయ్యాలి - చేసేదే చెప్పాలి తప్ప మరొకటి మాట్లాడకూడదని రాజు రవితేజ పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటల వెనక ఉన్న పూర్తి విడమరిచి చెప్పలేకపోయినా... పవన్ తన విషయంలో అలా లేరనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చారనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో పూనం కౌర్ విషయం పై కూడా రాజు రవితేజ స్పందించారు. ఆమె చేస్తోన్న ట్వీట్లను తాను పెద్దగా పరిశీలించింది లేదు కానీ... వారిద్దరి విషయంలో తాను ఎప్ప్పుడూ కల్పించుకోలేదని అన్నారు. ఇదే సమయంలో పవన్ - పూనం వ్యవహారంలో తాను మధ్యవర్తిని అనే వ్యాఖ్యలు కూడా అసత్యాలని రాజు రవితేజ స్పష్టం చేశారు.

పూనం వ్యవహారానికి సంబంధించి పవన్ తో తాను ఒక్కసారి మాత్రమే డిస్కస్ చేసినట్లు చెప్పిన రవితేజ... అది ఆయన ప్రైవేట్ విషయం కాబట్టి తాను చెప్పడం భావ్యం కాదని అన్నారు. ఇప్పటికీ తాను పవన్ ని ఒక బ్రదర్ గానే చూస్తానని తెలిపారు. ఆయన ప్రైవేటు లైఫ్ విషయాలు చెప్పడం భావ్యం కాదని అన్నారు.

ఇక రేణూ దేశాయ్ విషయంలో కూడా రాజు రవితేజ పూర్తిగా స్పందించలేదు. వారిద్దరూ విడిపోవడానికి డబ్బు కారణమా, ఈగో కారణమా, మరేదైనా కారణమా, మరెవరైనా కారణమా, అసలైన అసలు కారణం ఏమిటి అనే విషయాల పై రాజు రవితేజ స్పందించడానికి ఆసక్తిని చూపలేదు! అది పూర్తిగా పవన్ ప్రైవేటు లైఫ్ కి సంబంధించిన విషయం అని, ఆ విషయాల పై తాను స్పందించడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక రాజు రవితేజ - పవన్ కల్యాణ్ ల ప్రయాణంలో "ఇజం" పుస్తకం అనేది కీలకం అని అంతా అంటుంటారు. ఈ విషయంలో ఆ పుస్తకం విషయంలో క్రెడిట్ మొత్తం తనదే అన్నట్లుగా పవన్ క్లెయిం చేసుకుంటున్నారంటూ ఎదురైన ప్రశ్నలకు రాజు రవితేజ సున్నితంగా స్పందించారు.

పవన్ తన సిద్ధాంతాన్ని చౌర్యం చేశారనే మాట చాలా పెద్దదైపోతుందని చెప్పిన ఆయన... అది ఎవరి కష్టం, ఎవరి సిద్ధాంతం అనేది కాలం డిసైడ్ చేస్తుందని.. ఆ పుస్తకం రాసి ఇప్పటికి 15 ఏళ్లు అవుతుందని.. ఇంకో 40 - 50 ఏళ్లు పడుతుందని అన్నారు.