Begin typing your search above and press return to search.

శుభమా అంటూ మొదలుపెడుతుంటే... రాజా సింగ్ హాట్ కామెంట్లు!

ఇందులో భాగంగా... ఏడాది తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ జోస్యం చెప్పారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 10:49 AM GMT
శుభమా అంటూ మొదలుపెడుతుంటే... రాజా సింగ్  హాట్  కామెంట్లు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును బీఆరెస్స్ నేతలు ఏమత్రం జీర్ణించుకోలేక మౌనంగా ఉంటున్నారని కథనాలొస్తున్న వేళ.. మరోపక్క బీజేపీ నేతలు మాత్రం తాజాగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజా ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్... తెలంగాణలో కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి చర్చనీయాంశం అయ్యాయి

అవును... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని గంటల్లో కొలువు తీరుతోంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క ఇప్పటికే మంత్రుల జాబితా సిద్దమైనట్లేనని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్, డీజీపీ, ఇతర అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటుగా దేశవ్యాప్తంగా ఆ పార్టీ కీలక నేతలు, మిత్రపక్షాల నేతలు హాజరుకాబోతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కీలకనేతలైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తుంది. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇందులో భాగంగా... ఏడాది తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని.. ఒక్క ఏడాది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన అప్పులు, లెక్కలు సరిజేయటానికే కాంగ్రెస్ కు సమయం సరిపోతుందని చెబుతూ... అలాటప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన గ్యాంరెటీల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

తెలంగాణలో కేసీఆర్‌ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారని.. ఇక పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటూ ప్రశ్నించిన రాజాసింగ్... బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమని రాజాసింగ్ పేర్కొన్నారు. అందువల్లే ఒక ఏడాది తర్వాత తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ రాజాసింగ్ జోస్యం చెప్పారు.

కాగా... గడిచిన తెలంగాణ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 64స్థానాల్లో విజయం సాధించగా.. మరో ఆప్షన్ లేకుండా బీఆరెస్స్ 39స్థానాలకే పరిమితమైంది. ఇక బీజేపీ కేవలం 8స్థానాల్లోనే విజయం సాధించింది. ఇక సీపీఎం 1 స్థానంలో గెలుపొందింది. ఈ సమయంలో ఒక ఏడాదిలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందన్నట్లుగా రాజాసింగ్ వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది.