ఎడారి రాష్ట్రంలో కాక.. సీఎం, మాజీ సీఎం, సీఎం క్యాండెట్ కు టికెట్లు
వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించే కల్చర్ లేని ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు కీలక పరిణామాలకు దారితీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికీ టికెట్లు రావడం ప్రాధాన్యంగా మారింది.
By: Tupaki Desk | 21 Oct 2023 12:13 PM GMTభౌగోళికంగా భిన్నమైన ఆ రాష్ట్రంలో ఎన్నికల కాక పెరిగింది. నిన్నమొన్నటివరకు వైరి వర్గాలుగా ఉన్న సీఎం, మాజీ డిప్యూటీ సీఎంలు ఒకే రాగం పాడుతుండగా.. అసలు మాజీ సీఎంకు టికెట్ వస్తుందో రాదోననే ఊహాగానానిని తెరపడింది. వరుసగా రెండోసారి ఏ పార్టీనీ ఆదరించే కల్చర్ లేని ఆ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు కీలక పరిణామాలకు దారితీయనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికీ టికెట్లు రావడం ప్రాధాన్యంగా మారింది.
ఒకే రోజు.. రెండు పార్టీల జాబితాలు
200 సీట్లున్న రాజస్థాన్ లో ప్రస్తుతం అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆయనకు మూడేళ్ల కిందటివరకు సచిన్ పైలట్ డిప్యూటీగా ఉండేవారు. అయితే, బీజేపీతో జట్టుకట్టి కాంగ్రెస్ ను చీల్చే ప్రయత్నాలు చేసిన ఆయన చివరకు రాహుల్ గాంధీ జోక్యంతో వెనక్కుతగ్గారు. కానీ, గెహ్లోత్ తో మాత్రం తాడోపేడో అంటున్నారు. ఇక గెహ్లోత్ 70 ఏళ్లు దాటి రాజకీయ చరమాంకంలో ఉన్నారు. ఆయన ఈసారి కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే సీఎం తానేనని భావిస్తున్నారు. వీరిద్దరికీ భిన్నమైన పరిస్థితి వసుంధరారాజేది. మహారాణిగా పేరున్న ఆమె రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. కానీ, ఈసారి మాత్రం వసుంధరను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పక్కన పెడతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆమెకు నిన్నటివరకు టికెట్ ఖరారు చేయలేదు. అయితే, శనివారం అటు కాంగ్రెస్ తో పాటు ఇటు బీజేపీ కూడా జాబితాలను విడుదల చేసి ఆశ్చర్యపరిచాయి. అధికార కాంగ్రెస్ కు ఇది తొలి జాబితానే. బీజేపీ మాత్రం 83 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటివరకు 124 మందికి టికెట్లు ఇచ్చినట్లయింది.
ఆమె అక్కడినుంచే..
వసుంధరా రాజే.. తనకు పెట్టని కోట అయిన ఝల్రాపటన్ నుంచే ఆమెను బరిలో దిగనున్నారు. ఇక్కడినుంచి ఆమె 4 సార్లు విజయం సాధించారు. విశేషం ఏమంటే.. చరిత్రలో నిలిచిన మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్‌ను నాథ్‌ద్వారా నుంచి బీజేపీ పోటీకి నిలిపింది. కాగా, కాంగ్రెస్ కేవలం 33 మందితో తొలి జాబితాను వెల్లడించింది. గెహ్లోత్ సర్దార్‌పురా నుంచి, సచిన్ పైలట్ టోంక్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ ఇంకా 167 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆదివారం వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఇంకొందరు అభ్యర్థులను ప్రకటిస్తారని భావిస్తున్నారు. రాజస్థాన్ లో నవంబరు 25న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటే డిసెంబరు 3న ఫలితాలను వెల్లడవుతాయి.