Begin typing your search above and press return to search.

రాజస్థాన్ బీజేపీకి కొత్త రాణి...వసుంధరా రాజే కి గట్టి ఝలక్...?

ఈసారి బీజేపీకి గెలిచే అవకాశాలు రాజస్థాన్ లో ఉన్నాయని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పకుండా ప్రచారం నిర్వహిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:24 PM GMT
రాజస్థాన్ బీజేపీకి కొత్త రాణి...వసుంధరా రాజే కి గట్టి  ఝలక్...?
X

రాజస్థాన్ బీజేపీ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె. ఆమె రెండు సార్లు రాజస్థాన్ నుంచి సీఎం గా పనిచేశారు. ఆమెది ఒంటెత్తు పోకడ అని అంటారు. ఆమె కారణంగానే 2018లో బీజేపీ ఓడిపోయింది అన్న చర్చ కూడా బీజేపీలో ఉంది.

ఈసారి బీజేపీకి గెలిచే అవకాశాలు రాజస్థాన్ లో ఉన్నాయని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పకుండా ప్రచారం నిర్వహిస్తోంది. సాధారణంగా సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ సీఎం ఉన్నపుడు వారినే ముందు పెట్టి ప్రచారం చేస్తారు. అయితే వసుంధరా రాజె ఊసు ఎత్తకుండా బీజేపీ అధినాయకత్వం జాగ్రత్త పడుతోంది.

ఆమెని సీఎం గా ఎక్కడా ప్రొజెక్ట్ చేయడంలేదు. దాంతో ఆమె వర్గీయులలో అయితే అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. బీజేపీ అధినాయకత్వంతో వసుంధర రాజేకు గ్యాప్ ఉందని కూడా టాక్ ఉంది. ఈ క్రమంలో వసుంధరా రాజే తప్పించి మరో లీడర్ ని ముందుకు తెస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది.

ఆమె ఎవరో కాదు జైపూర్ మహారాణి దియా కుమారిగా చెబుతున్నారు. ఆమె బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు. బ్రిటీష్ హయాంలో సంస్థానాలను పాలించిన ఆనాటి రాజు అయిన రాజా మాన్ సింగ్ కి మనవరాలు అవుతారు. ఆమె బాగా చదువుకున్నారు. అంతే కాదు బీజేపీ హై కమాండ్ కి ఆమె పనితీరు కూడా నచ్చుతుంది అని అంటున్నారు.

అనీ కలసి వస్తే దియాకుమారిని వచ్చే ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిని చేయడానికి బీజెపీ రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు. బీజేపీకి రాజస్థాన్ లో మొదటి నుంచి బలం ఉంది. ఈ దేశానికి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన బైరన్ సింగ్ షెకావత్ ది రాజస్థాన్. ఆయన రెండు సార్లు బీజేపీకి ముఖ్యమంత్రిగా పనిచేసి కమలం పార్టీని అక్కడ బాగా పటిష్టం చేసారు.

ఆ తరువాత వసుంధరారాజే సీఎం గా రెండు సార్లు అయ్యారు. ఆమె రాజ వంశానికి చెందిన వారు కావడం విశేషం. ఇపుడు అదే రాజవంశానికి చెందిన కొత్త రాణితోనే వసుంధరకు చెక్ చెప్పాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక ఆమె ఒకవేళ కాకపోతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు మరో ఆరేడుగురు ఎంపీల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కావాలని వసుంధరారాజే చూస్తూంటే ఆమెకు మోకాలడ్డెలా బీజేపీ పెద్దలు కొత్త ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు.