అక్బర్ గొప్ప పాలకుడు కాదు.. ఒక రేపిస్ట్!
ఫిబ్రవరి 25న బలోత్రాలోని ఆలయానికి చేరుకున్న మంత్రిని రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లోని అక్బర్ పై పాఠంపై స్పందించాలని విలేకరులు కోరారు
By: Tupaki Desk | 26 Feb 2024 10:35 AM GMTరాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తులో అందరికంటే గొప్పవాడిగా పేరున్న అక్బర్ ను మంత్రి దిలావర్ రేపిస్ట్‌గా అభివర్ణించారు. అతడు గొప్ప పాలకుడేంటి.. అతడొక రేపిస్ట్ అంటూ అక్భర్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
ఫిబ్రవరి 25న బలోత్రాలోని ఆలయానికి చేరుకున్న మంత్రిని రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లోని అక్బర్ పై పాఠంపై స్పందించాలని విలేకరులు కోరారు. దీంతో మంత్రి దిలావర్.. అక్బర్ పై విరుచుకుపడ్డారు. మొఘల్ పాలకులు అందమైన మహిళలను తీసుకువచ్చి అత్యాచారం చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్బర్ ను గొప్పగా పేర్కొనడంపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
'అక్బర్ ఎప్పుడూ గొప్పవాడు కాదు. అతను దాడి చేసేవాడు మరియు రేపిస్ట్. మీనా బజార్ నడుపుతూ అక్కడి నుంచి అందమైన మహిళలను తీసుకొచ్చి అత్యాచారం చేసేవాడు. అలాంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి అనడం అవివేకం' అని మంత్రి దిలావర్ వ్యాఖ్యానించారు.
పాఠశాల పుస్తకాల్లో భారీ మార్పులకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. తాను ఎలాంటి మార్పులు తీసుకురావాలని కోరుకోవడం లేదని తెలిపారు. అయితే పాఠ్యపుస్తకాల్లో కొన్ని తప్పుడు విషయాలు తొలగిస్తామని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.
కాగా గత జనవరి 30న విలేకరుల సమావేశంలో దిలావర్ మాట్లాడుతూ.. 'మాకు పాఠ్యాంశాల్లో మార్పు చేయాల్సిన అవసరం లేదు. కానీ తప్పుగా ఉన్న లేదా గొప్ప వ్యక్తులను అవమానించే కంటెంట్ ను తీసివేస్తాం. ఛత్రపతి శివాజీ, దామోదర్ వీర్ సావర్కర్ వంటి మన పూర్వీకుల గురించి చాలా తప్పుడు సమాచారం ఉంది. ఆ విషయాలు సరిచేస్తాం' అని తెలిపారు.
సావర్కర్ దేశభక్తుడు కాదని చాలా పుస్తకాలలో చెప్పబడిందని మంత్రి దిలావర్ గుర్తు చేశారు. అలాగే అక్బర్ ను గొప్పవాడిగా చిత్రీకరించారని మండిపడ్డారు. శివాజీని, మహారాణా ప్రతాప్ గురించి మరిన్ని పాఠ్యాంశాలను ప్రవేశపెడతామని తెలిపారు.
కాగా మంత్రి దిలావర్ ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ లోని బీజేపీ ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్బర్ పై దిలావర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.