Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి ధోనీ..? బీసీసీఐ ఉపాధ్యక్షుడి సమాధానంతో సంచలనం!

భారత దేశంలో సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఈ మూడే ప్రజలను అత్యంత ప్రభావితం చేసేవి. సినిమాల నుంచి, స్పోర్ట్స్ నుంచి పొలిటీషియన్లు కావడం చాలా తేలిక.

By:  Tupaki Desk   |   2 Feb 2025 5:30 PM GMT
రాజకీయాల్లోకి ధోనీ..? బీసీసీఐ ఉపాధ్యక్షుడి సమాధానంతో సంచలనం!
X

భారత దేశంలో సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఈ మూడే ప్రజలను అత్యంత ప్రభావితం చేసేవి. సినిమాల నుంచి, స్పోర్ట్స్ నుంచి పొలిటీషియన్లు కావడం చాలా తేలిక. అంతెందుకు..? టీమ్ ఇండియాలో ప్రస్తుతం సభ్యులైన కొందరిని భారత రాజకీయాలతో సబంధం ఉంది. టి20ల్లో స్థానం సుస్థిరం చేసుకుంటున్న యువ డాషింగ్ బ్యాట్స్ మన్ రింకూసింగ్ కు ఇటీవలే ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో వివాహం నిశ్చయమైంది. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యే. వీరంతా కాదు.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ 2019-24 మధ్య బీజేపీ ఢిల్లీ ఎంపీ.

భారత జట్టుకు పదేళ్లు కెప్టెన్ గా వ్యవహరించిన మొహమ్మద్ అజహరుద్దీన్, ఓ దశలో సిక్సర్ల సిద్ధూగా పేరు మార్మోగిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ తరఫున పదవులు చేపట్టారు. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. భారత క్రికెటర్లకు ఉన్న పాపులారిటీని చూసి కూడా రాజకీయ పార్టీలు వారికి వల వేస్తుంటాయి.

పశ్చిమ బెంగాల్ ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ మూడేళ్ల కిందట టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని తమ పార్టీలో చేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.

భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్నది కేవలం మహేంద్ర సింగ్ ధోనీకే. జార్ఖండ్ నుంచి వచ్చిన ధోనీకి డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అతడు గనుక రాజకీయాల్లోకి వస్తే సొంత రాష్ట్రంలో తిరుగు ఉండదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ధోనీ రాజకీయ ప్రయాణంపై ఓ కథనం బయటకు వచ్చింది.

రెండు నెలల కిందట జరిగి జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి మరోసారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఎలాగైనా గెలవాలని బీజేపీ ఎత్తులు వేసినా అవి పారలేదు. కాగా, ధోనీ మంచి రాజకీయ వేత్త కాగలడని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనీ రాజకీయాల్లోకి వస్తాడో రాడో కానీ.. వస్తే మాత్రం గొప్ప నాయకుడు అవుతాడని పేర్కొన్నారు. కచ్చితంగా ధోనీ గెలుస్తాడని.. అతడికి పాపులారిటీ చాలా ఎక్కువని చెప్పుకొచ్చారు. ఎంపీగా పోటీ చేయడంపై తాను ఓసారి ధోనీని అడగ్గా అదంతా అవాస్తవం అని చెప్పాడన్నారు. ధోనీ పేరు ప్రఖ్యాతులతో వచ్చే హడావుడికి దూరంగా ఉంటాడని.. కనీసం మొబైల్ ఫోన్ కూడా వాడడని రాజీవ్ శుక్లా తెలిపారు.