కూతురిపై రాజేంద్రప్రసాద్ ప్రేమ ఎలాంటిదంటే..
ఆ పాట విన్నాక తనను పిలిపించి ఎమోషనల్ అయినట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా కూతురంటే తనకెంత ప్రేమో రాజేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పారు.
By: Tupaki Desk | 5 Oct 2024 10:33 AM GMTటాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంట ఈ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తనయురాలు గద్దె గాయత్రి గుండెపోటుతో మరణించింది. కన్న బిడ్డను కోల్పోవడం అన్నది తల్లిదండ్రులకైనా తట్టుకోలేని విషాదమే. అందులోనూ కూతురిపై తండ్రికి ఉండే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కూతురంటే తనకెంత ఇష్టమో గతంలో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ కదిలిపోతున్నారు.
ఓ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అమ్మ మీద సుద్దాల అశోక్ తేజ రాసిన ఓ పాట గురించి రాజేంద్ర ప్రసాద్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తనకు పదేళ్ల వయసు ఉండగా తల్లి చనిపోయినట్లు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఐతే తల్లి పోయిన లోటును తనకు తర్వాత కూతురే తీర్చిందని.. తనలోనే తల్లిని చూసుకున్నానని ఆయన చెప్పారు.
ఐతే సుద్దాల అశోక్ తేజ అమ్మ మీద రాసిన పాటను మొబైల్లో విని తాను చాలా ఎమోషనల్ అయిపోయానని.. అప్పుడు తన కూతురిని ఇంటికి పిలిపించి మరీ ఆ పాటను వినిపించి ఏడ్చానని రాజేంద్ర ప్రస్రాద్ చెప్పారు.
ఆ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. తన ఒక్కగానొక్క కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్లిపోయిందని.. దీంతో తనతో మాట్లాడ్డం మానేశానని చెప్పారు. ఆ పాట విన్నాక తనను పిలిపించి ఎమోషనల్ అయినట్లు వెల్లడించారు. ఆ సందర్భంగా కూతురంటే తనకెంత ప్రేమో రాజేంద్ర ప్రసాద్ చెప్పకనే చెప్పారు.
అలాంటి కూతురిని ఇప్పుడు పోగొట్టుకున్నందుకు ఆయనెంత బాధ పడుతూ ఉంటారో మాటల్లో చెప్పడం కష్టం. గాయత్రి వయసు 38 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం విచారకరం. గాయత్రి తనయురాలు తేజస్విని చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటించింది. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కొడుకు కూడా ఉన్నాడు.