Begin typing your search above and press return to search.

‘పవన్ ని ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం’... మహాసేన రాజేష్ కామెంట్స్ వైరల్!

అవును... నాకు నేనుగా జనసైనికుడిగా ప్రకటించుకున్న వ్యక్తిని అని మొదలుపెట్టిన రాజేష్... పవన్ కల్యాణ్ పై నాడున్న అభిప్రాయంతో తనకు తానే ప్రకటించుకున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   7 May 2024 12:27 PM GMT
‘పవన్ ని ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదం’... మహాసేన రాజేష్ కామెంట్స్ వైరల్!
X

ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాలోనే పి. గన్నవారం అసెంబ్లీ స్థానానికి టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న సరిపల్లి రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్.. ఆ తర్వాత బీ-ఫామ్ మాత్రం పొందలేకపోయారనేది తెలిసిన విషయమే! ఈ సమయంలో తాజాగా "పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం..!" అంటూ వీడియో విడుదల చేశారు రాజేష్! ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!

అవును... నాకు నేనుగా జనసైనికుడిగా ప్రకటించుకున్న వ్యక్తిని అని మొదలుపెట్టిన రాజేష్... పవన్ కల్యాణ్ పై నాడున్న అభిప్రాయంతో తనకు తానే ప్రకటించుకున్నట్లు తెలిపారు. దీంతో... కొన్ని వందల వీడియోల్లో, పవన్ కల్యాణ్ గొప్ప వ్యక్తి అని కొన్ని కోట్ల మందికి చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ వెళ్తున్న విధానం చూస్తుంటే చాలా ప్రమాదకరంగా ఉందని రాజేష్ అభిప్రాయపడ్డారు!

వాస్తవానికి తనకు తానుగా జనసైనికుడిగా ప్రకటించుకుని.. పవన్ కల్యాణ్ కోసం ఎన్నో వీడియోలు చేసి, ఎంతో ప్రచారం చేసినప్పటికీ, ఎంతో డబ్బు పోగొట్టుకున్నప్పటికీ.. తనను పిలిచి కనీసం కండువా కప్పలేదని రాజేష్ ఆరోపించారు! ఇదే సమయంలో తనకు టీడీపీ టిక్కెట్ ఇచ్చినప్పుడు జనసైనికులు ఆందొళన చేశారని.. ఆ సమయంలో పవన్ కల్యాణ్ వారిని కాస్త గద్దిస్తారేమో అని తాను భావించినట్లు చెప్పారు.

పైగా తనకు పి.గన్నవరం టిక్కెట్ టీడీపీ ఇస్తే... కోనసీమ అంతా టీడీపీ అభ్యర్థులను ఓడించాలని జనసైనికులు తీర్మానం చేసుకున్నారంట అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటివరకూ వైసీపీలో ఉండి వచ్చిన నేతలను అక్కున చేర్చుకుంటున్న పవన్ కల్యాణ్.. తన కోసం వైసీపీతో ఎన్నో ఇబ్బందులు పడిన తనను మాత్రం గుర్తించకపోవడానికి ఏ కారణం ఉందో ఏమో అనుకున్నట్లు చెప్పుకొచ్చారు!

ఇక పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ పొత్తు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విషయంలో టీడీపీ తీవ్రంగా నష్టపోయిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... జనసేన కలిసిన తర్వాత అప్పటివరకూ టీడీపీకి దగ్గరగా ఉన్న బీసీలను కూడా కూటమి కోల్పోయిందని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను టీడీపీకి దగ్గరగా చేసుకుంటే... వారందరినీ పవన్ కలిశాక దూరం చేశారని రాజేష్ వ్యాఖ్యానించారు.

ఇదే క్రమంలో... కనీసం 120 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందనే స్థాయి నుంచి ఈ రోజు నెక్ అండ్ నెక్ పరిస్థితి వచ్చేసిందని.. అందుకు కారణం కేవలం పొత్తు అని మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఇవి విన్నాక తనకు ఏమి చేసినా కానీ... ఇది వాస్తవం అని, పొత్తు వల్ల టీడీపీ అనీ విధాలా నష్టపోతుందంటూ మహాసేన రాజేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... జనసేన కార్యకర్తలు ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఓటు టీడీపీకి వేసినా వేయకున్నా.. ఎంపీ ఓటు మాత్రం జనసేనకు వేయమని ప్రచారం చేస్తున్నారని.. పరిస్థితి అక్కడివరకూ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో... తాను చెప్పినా కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట కూటమికి ఓటు వేమని చాలా మంది తనతో చెబుతున్నారని రాజేష్ తెలిపారు.

ఈ సందర్భంగా రాజమండ్రి సభలో పవన్ ప్రసంగాన్ని ప్రస్థావించిన రాజేష్... బీజేపీకి 400 సీట్లు రావడానికి జనసేనాని ప్రాణత్యాగం చేస్తామని చెబుతున్నారని.. ఈ విషయంలో అసలు పవన్ కు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో కొన్ని కీలక సవరణలు చేసుకోవడం కోసమే ఆ మెజారిటీ అని చెప్పుకొచ్చారు!

ఈ సందర్భంగా... అంబేద్కర్ ఇచ్చిన ప్రాథమిక హక్కులు వంటివాటిని సవరించడం కోసం పార్లమెంటులో మూడు వంతుల మెజారిటీ అవసరం పడుతుందని.. ఇప్పుడు అంత మెజారిటీ బీజేపీ నేతలు అడుగుతున్నారంటే.. వారికి ఆ ప్రాథమిక హక్కులను మార్చే ఆలోచన ఏమైనా ఉందేమో? అంటూ రాజేష్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి కల్పించడానికి పవన్ కల్యాణ్ ప్రాణత్యాగం చేయడం ఎందుకని అన్నారు!

ఇదే క్రమంలో... ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హీరోటిక్ స్టేట్ మెంట్ ఇచ్చారని.. గతంలో జగన్ ఎలా ఉంటారని తాను భావించానో, అలాంటి జగన్ కనిపించారని అన్నారు! అయితే పవన్ కల్యాణ్ మాత్రం... ముస్లిం రిజర్వేషన్ విషయంలో మాట్లడటం లేదని అన్నారు!!

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా తమ టీం అంతా బలంగా పనిచేస్తుందని చెప్పిన రాజేష్... ఎవరి బలం వారు చూపిస్తారని తెలిపారు. పవన్ కల్యాణ్ కి చాలా బలం ఉండొచ్చు, 400 సీట్లు గెలిపించడం కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్పొచ్చు కానీ... పిఠాపురంలో ఆయన నెగ్గాలంటే మాత్రం వర్మ ఆశీస్సులు ఉండాల్సిందే అని నొక్కి చెప్పారు!

ఈ సందర్భంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్ధస్త్ టీం లను, రికార్డింగ్ డ్యాన్స్ టీం లను, సీరియల్స్ టీం లను, హీరోలను, ఇంతమందిని ఒక్క మహిళపై గెలవడానికి దించుతున్నది ఎందుకని ప్రశ్నించారు. పార్టీ అధినేత అయిన పవన్ కూడా గెలవడానికి ఇలా గంగాలమ్మ సంబరానికి దించినట్లు రంగంలోకి దించుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో... పవన్ కల్యాణ్ పై తనకు వ్యక్తిగతంగా ఏమీ కోపం లేదని చెబుతూ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం రాష్ట్రానికి చేటని రాజేష్ తెలిపారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలో వంగ గీత చేతిలో ఫలితం కాస్త అటు ఇటు అయితే... జనసేన పార్టీ పరిస్థితి క్లోజ్ అని చెప్పుకొచ్చారు! ఫైనల్ గా... జనసేనను ఓడించడానికి మహాసేన పని చేస్తాదని క్లారిటీ ఇచ్చి ముగించారు! ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది!