తలైవా (X) తలైవి.. ఇన్నాళ్లకు వైరంపై రజనీ ఓపెన్‌గా
నాటి ఘటన ప్రజల్లో విస్త్రతంగా చర్చకు వచ్చింది. ఆ ఒక్క సంఘటన రజనీ మైండ్ సెట్ లో చాలా మార్పులకు శ్రీకారం చుట్టింది.
By: Tupaki Desk | 9 April 2025 4:28 PMతమిళ చిత్ర పరిశ్రమలో లెజెండరీ నటుడు, తలైవా రజనీకాంత్ .. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, `తలైవి`గా గుర్తింపు పొందిన అమ్మ జయలలిత మధ్య వైరం గురించి తెలిసిందే. బ్లాక్ బస్టర్ `బాషా` మూవీ ప్రచార వేదికపై రజనీ చేసిన ఓ కామెంట్ పొలిటికల్ గా కాకలు పుట్టించింది. ఇది రజనీ స్నేహితుడి రాజకీయ పదవికి ఎసరు పెట్టింది. నాటి ఘటన ప్రజల్లో విస్త్రతంగా చర్చకు వచ్చింది. ఆ ఒక్క సంఘటన రజనీ మైండ్ సెట్ లో చాలా మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఆ రోజు తాను చేసిన పొలిటికల్ కామెంట్ కారణంగా రజనీ అతఃహశుడయ్యాడు. తన స్నేహితుడైన ప్రముఖ నిర్మాత-రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్ పదవిని కోల్పోవడంతో రజనీ నిజంగా చాలా కంగారు పడ్డారు. రజనీతో వీరప్పన్ అనుబంధం ఎంతో గొప్పది. దీంతో రజనీ తన వల్ల స్నేహితుడు తన పదవిని కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కానీ జీవితంలో ఆ ఘట్టం చాలా అనూహ్యమైనది.. అరుదైనది.. అది తనను మరింత బలంగా మార్చింది.
సత్య మూవీస్ బ్యానర్ కింద ఆర్.ఎం. వీరప్పన్ అప్పట్లో ఎన్నో క్లాసిక్ హిట్లు అందించారు. రజనీకాంత్ కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ చిత్రాల వెనుక ఆయన ఉన్నారు. ఈ అద్భుత స్నేహితుల సన్నిహిత అనుబంధం ఇటీవల ఆర్.ఎం. వీరప్పన్ సినీరాజకీయ వారసత్వంపై రూపొందించిన `ఆర్.ఎం.వి: ది కింగ్ మేకర్` అనే డాక్యుమెంటరీ కారణంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
బాషా శతదినోత్సవ వేడుకలో అసలు ఏం జరిగింది? అనేదానికి ఈ డాక్యుమెంటరీలో జవాబు దొరికింది. రజనీకాంత్ 1995లో సత్య మూవీస్ నిర్మించిన తన బ్లాక్ బస్టర్ మూవీ `బాషా` శతదినోత్సవ వేడుక సందర్భంగా ఒక కీలకమైన పొలిటికల్ అంశాన్ని టచ్ చేస్తూ మాట్లాడారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జె. జయలలిత హయాంలో ఎఐఎడిఎంకె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆర్.ఎం. వీరప్పన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తన ప్రసంగంలో రజనీకాంత్ అనూహ్యమైన కమెంట్ చేసారు. తమిళనాడులో `వారసత్వ రాజకీయాలు` పెరగడం, హింస, కుయుక్తుల రాజకీయ వాతావరణం కారణంగా రాష్ట్రం `స్మశానవాటిక`గా మారే ముప్పు ఉందని విమర్శించారు. ఈ సాహసోపేతమైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. జయలలిత ఆర్.ఎం. వీరప్పన్‌ను మంత్రి పదవి నుండి తొలగించడంలో రజనీ కామెంట్ కీలక పాత్ర పోషించింది. తలైవితో దళపతి వైరానికి ఇది ఆది!
తర్వాత జరిగిన పరిణామాలను గుర్తుచేసుకుంటూ ఆర్.ఎం. వీరప్పన్ ఎదుర్కోవాల్సిన పరిణామాలకు తాను తీవ్రంగా చింతిస్తున్నానని రజనీకాంత్ అన్నారు. ఊహించని పరిణామాలకు క్షమాపణ చెప్పడానికి మరుసటి రోజు ఆయన ఆర్.ఎం.వి.కి ఫోన్ చేశారు. కానీ వీరప్పన్ ప్రశాంతంగా, ఎంతో గౌరవంగా ప్రతిస్పందిస్తూ ``దాని గురించి చింతించకండి. నేను ఏ పదవినీ పట్టించుకోను. నేను దానికి కట్టుబడి లేను. పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించి మీ ఆత్మగౌరవాన్ని కోల్పోకండి`` అని చెప్పినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ ఆ రోజు ఆ ఘటనతో చాలా మారారు. ఈ అనూహ్య సంఘటన అతడిపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. తరువాతి సంవత్సరాల్లో జయలలితకు వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడాలనే తన సంకల్పాన్ని బలోపేతం చేసింది. ఆర్.ఎం వీరప్పన్ శాంతస్వభావం, జ్ఞానానికి రజనీకాంత్ నివాళులు అర్పించారు. సీరియస్ పొలిటికల్ అజెండా, గొప్ప వినయం, ఆగ్రహం లేకుండా ముందుకు సాగే బలం కలిగిన ఆర్.ఎం వీరప్పన్‌ను `కింగ్ మేకర్` అంటూ భావోద్వేగానికి గురైన రజనీకాంత్ అభివర్ణించారు. బాషా వేడుకలో జరిగిన సంఘటన జయలలితకు వ్యతిరేకంగా తన రాజకీయ అభిప్రాయాలను, ప్రజల పట్ల వైఖరిని రూపొందించిన కీలక క్షణాలలో ఒకటి అని రజనీకాంత్ పేర్కొన్నారు. దాదాపు 30ఏళ్ల తర్వాత నాటి ముఖ్యమంత్రి జయలలితతో తన వివాదం గురించి రజనీ స్పష్ఠంగా మాట్లాడటం ఫ్యాన్స్ లో ఇప్పుడు చర్చగా మారింది.