ఢిల్లీలో మోగిన నగారా.. ఎన్నికలు ఎప్పుడంటే..?
చిన్న ప్రాంతమే అయినా.. ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది.
By: Tupaki Desk | 7 Jan 2025 9:55 AM GMTచిన్న ప్రాంతమే అయినా.. ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 70 శాసనసభ స్థానాలున్న ఈ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 23తో ముగియనుంది. పదకొండేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పటికీ ‘ఢిల్లీ’పై అధికారం లేకుండా పోయింది బీజేపీకి. ప్రధాని మోదీ ఎంత ప్రయత్నించినా ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ హవాను అడ్డుకోలేకపోయారు. రెండుసార్లు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ ను మట్టికరిపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే, 2024లో మాత్రం భారీ ఝలక్ తగిలింది ఆ పార్టీకి. అధినేత కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు కావడం, ఆపై నెలల పాటు జైల్లో ఉండడం అందరికీ తెలిసిందే. ఇక ఆయన బయటకు వచ్చాక సీఎం పదవిని వదిలేసి.. ఆ స్థానంలో మహిళా నాయకురాలు అతిశీని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఢిల్లీ కీలకమైన ఎన్నికల ముంగిట నిలిచింది.
ఎన్నికోలాహలం..
ఢిల్లీ ఎన్నికల ఎడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 సీట్లున్న ఢిల్లీలో ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణ గడువు జనవరి 17, పరిశీలన జనవరి 18, ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 20గా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
దేశ రాజధానిలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు హక్కు వినియోగించుకునేందుకు 13,033 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.