Begin typing your search above and press return to search.

డీలిమిటేషన్ టెన్షన్.. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ ఏమన్నారంటే..

లోక్ సభ లేదా అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న సీట్లు పెరుగుతాయే తప్ప, తగ్గిపోవడం అంటూ ఉండదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు.

By:  Tupaki Desk   |   11 March 2025 6:28 PM IST
డీలిమిటేషన్ టెన్షన్.. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ ఏమన్నారంటే..
X

దక్షిణాది రాష్ట్రాలను టెన్షన్ పెడుతున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ జరిగితే లోక్ సభలో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల బహిరంగ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్రంతో పోరాడేందుకు కలిసి రావాలంటూ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మూడు ఉత్తరాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ అంశం జాతీయస్థాయిలో చర్చకు తెరలేపగా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

లోక్ సభ లేదా అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న సీట్లు పెరుగుతాయే తప్ప, తగ్గిపోవడం అంటూ ఉండదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో దక్షాణాది రాష్ట్రాలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాదనను కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుందని, దీనిపై అభ్యంతరాలు ఉంటే, తమిళనాడు సీఎం వాటిని లేవనెత్తే స్చేచ్ఛ ఉందన్నారు. అధికారులు వారితో చర్చలు జరుపుతారని, న్యాయమైన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

తమిళనాడుతోపాటు ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనూ పార్లమెంటు సీట్లు పెరుగుతాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనే వాదన సరైనది కాదని అభిప్రాయపడ్డారు. కాగా, దేశంలో ప్రస్తుత జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే తమిళనాడుతోపాటు జనాభా నియంత్రణ పాటించిన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేత్రుత్వంలో కొన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం స్టాలిన్ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.