ఏపీ రాజకీయాలపై సిగ్నల్ ఇచ్చేసిన రాజ్‌నాథ్.. నెక్ట్స్ ఏంటి..!
కేంద్ర మంత్రి, బీజేపీని ఒకప్పుడు నడిపించిన మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో రాజకీయాల పై సంకేతాలు ఇచ్చేశారు
By: Tupaki Desk | 28 Feb 2024 5:30 PM GMTకేంద్ర మంత్రి, బీజేపీని ఒకప్పుడు నడిపించిన మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీలో రాజకీయాల పై సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన మిత్రపక్షంతో బీజేపీ కలిసి అడుగులు వేస్తుందా? వేయదా? అనే మీమాంసను ఆయన పటాపంచలు చేశారు. అయితే.. ఆయన నేరుగా ఏమీ వ్యాఖ్యలు చేయకపోయినా.. పరోక్షంగాపదే పదే చేసిన వ్యాఖ్యలు మాత్రం పొత్తులపై క్లారిటీ ఇచ్చేసినట్టేన ని బీజేపీ, టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
''ఏపీలో మన ప్రభుత్వం ఏర్పడుతోంది''- అని మూడు చోట్ల(విజయవాడ, విశాఖ సహా పార్టీ కార్యాలయం) నిర్వహించిన సమావేశాల్లో రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. అంటే.. బీజేపీ.. టీడీపీ-జనసేన తో పొత్తుకు దాదాపు సిద్ధమైందనే సంకేతాలు ఇచ్చినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. తాము ఒంటరిగానో ఎన్నికలకు వెళ్తామని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
ఇదే విషయాన్ని పార్టీ నాయకులు కూడా పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ఆప్షన్ బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం లేదా.. మిత్రపక్షం టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లడం. దీనిలో బీజేపీ ఒంటరిగా వెళ్లే పరిస్థితి లేనే లేదు. పైగా... ఆ మేరకు 175 మంది అభ్యర్థులు కూడా పార్టీకి లేరు. దీంతో రెండో ఆప్షన్ వైపే కమల నాథులు దృష్టి పెట్టినట్టు రాజ్‌నాథ్ వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోందని అంటున్నారు పరిశీలకులు. అంటే.. కొంత ఆలస్యమైనా కూడా మిత్రపక్షంతో బీజేపీ చేతులు కలపడం ఖాయం.
మరి నెక్ట్స్ ఏంటి? అనేది చూస్తే... బీజేపీ నాయకులు, కార్యకర్తలు.. ఆమేరకు మిత్రపక్షంతో కలిసి నడవా ల్సి ఉంటుంది. అయితే.. దీనిలో కొన్ని కొన్ని ఇబ్బందులు తెరమీదికి వస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన అభ్యర్థులు టికెట్ల విషయంలో రగడ చేస్తున్నారు. దీనిని సర్దు బాటు చేసి కలిసి నడిపించడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు బీజేపీని కలుపుకొంటే.. మరిన్ని సమస్యలు రానున్నాయనే చర్చ వస్తోంది. దీనిని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి.