హైకోర్టులో రాజ్ పాకాలకు ఉపశమనం... పోలీసులకు కీలక ఆదేశాలు!
ఈ సమయంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీ జారీచేశారు.
By: Tupaki Desk | 28 Oct 2024 11:10 AM GMTజన్వాడ ఫామ్(హౌస్) పార్టీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా ఈ వ్యవహారంపై బీఆరెస్స్ - కాంగ్రెస్ నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీ జారీచేశారు.
ఇందులో భాగంగా... బీ.ఎన్.ఎస్.ఎస్. 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు! దీంతో... ఈ నోటీసులపై రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసిన ఆయన... పోలీసులు ఈ కేసులో అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. దీంతో.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అవును... తనను అక్రమంగా ఇరికించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని.. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజ్ పాకాల వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా... ఇంట్లో పార్టీ చేసుకుంటే పోలీసులు కేసులు నమోదు చేశారంటూ రాజ్ తరుపు న్యాయవాది మయూర్ రెడ్డి తెలిపారు.
ఉదయం 9:30 గంటలకు నోటీసులు ఇచ్చి, 11 గంటలకు విచారణకు రమ్మంటున్నారని కోర్టుకు తెలిపారు. అయితే... ఫిర్యాదులు అందడంతోనే పోలీసులు దాడులు చేశారని.. ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలపగా.. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు వ్యాఖ్యానించిందని తెలుస్తోంది.
ఇదే సమయంలో.. పోలీసు విచారణకు న్యాయవాదితో వెళ్లొచ్చని తెలిపిన హైకోర్టు.. రాజ్ పాకాలకు రెండు రోజులు సమయం ఇవ్వాలని ఆదేశించింది!