మహారాష్ట్ర పోరు : ఠాక్రేలలో వీర హిందూత్వ ఎవరు...?
ఆయన అరవై దశకంలో శివసేన పార్టీని స్థాపించి నాటి అధికార కాంగ్రెస్ మీద పోరాటం చేశారు.
By: Tupaki Desk | 13 Aug 2024 3:38 AM GMTదేశంలో మళ్ళీ హిందూత్వ నినాదం ఊపందుకుంటోంది. అది కూడా మహారాష్ట్ర నుంచే. మహారాష్ట్రలో ఇప్పటికి ఆరు దశాబ్దాల క్రితమే హిందూత్వ నినాదాలకు ఊపిరులూదిన వారు బాల్ ఠాక్రే. ఆయన అరవై దశకంలో శివసేన పార్టీని స్థాపించి నాటి అధికార కాంగ్రెస్ మీద పోరాటం చేశారు. అది కాస్తా ఒక బలమైన శక్తిగా మారి 90 దశకం నాటికి అధికారంలోకి వచ్చింది.
బాల్ థాక్రే పార్టీకి వెన్ను దన్నుగా ఉన్నది ఆయన సోదరుని కుమారుడు రాజ్ ఠాక్రే. ఆయన శివసేన విద్యార్ధి విభాగాన్ని స్థాపించారు. అలా బాల్ థాక్రేకు వారసుడిగా తొంబై దశకంలో రాజకీయాల్లోకి దూసుకుని వచ్చారు. అచ్చం బాల్ ఠాక్రే ని పోలిన తీరున దూకుడుతో కూడిన ప్రసంగాలు చేయడంతో రాజ్ ఠాక్రే దిట్ట. ఆయన కూడా పెదనాన్న బాటలో వీర హిందూత్వ నినాదాన్ని వ్యాప్తి చేశారు
ఇక చూస్తే 1995లో మహారాష్ట్రలో శివసేన బీజేపీ సంకీర్ణం తొలిసారిగా అధికారంలోకి రావడానికి రాజ్ ఠాక్రే ఎంతో కృషి చేశారు. అలా దశాబ్దన్నర కాలం పాటు ఆయన పెదనాన్న బాల్ థాక్రేతో ఉన్నారు. అయితే బాల్ ఠాక్రే సొంత కుమారుడు ఉద్ధవ్ థాక్రేని రాజకీయాల్లోకి తీసుకుని రావడంతో సోదరులు ఇద్దరి మధ్యన విభేదాలు మొదలయ్యాయి.
దాంతో శివసేనను వీడి రాజ్ ఠాక్రే సొంతంగా మహా రాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించారు. ఆయన పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు అయితే దక్కలేదు. దానికి కారణం బీజేపీ శివసేన బంధం గట్టిగా ఉండడం. 2019 తరువాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కాంగ్రెస్ తో ఎన్సీపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అలా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో శివసేన మూల సిద్ధాంతాలకు ఉద్ధవ్ భంగం కలిగించారని రాజ్ ఠాక్రే ఆరోపిస్తూ వచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే శివసేన నిలువునా చీలింది. అందులో నుంచి ఏక్ నాధ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో చేతులు కలిపి సీఎం అయ్యారు.
ఇపుడు వీర హిందూత్వ ఎవరు అన్నది ఠాక్రే సోదరుల మధ్యన రాజకీయ పోరుగా సాగుతోంది. బాల థాక్రేకు అసలు వారసుడు ఎవరు అన్నది మహారాష్ట్ర ఎన్నికల్లో తేల్చుకోవాలని రాజ్ ఠాక్రే మరో వైపు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారు. దూకుడుగా రాజకీయాలు చేయడంతో పాటు ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంతో రాజ్ ఠాక్రే దిట్ట. ఆయన అచ్చం బాల్ ఠాక్రే మాదిరిగానే జనాలను ప్రభావితం చేయగలరు.
ఇపుడు ఆయన మళ్ళీ రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ తో కలసిన ఉద్ధవ్ ఠాక్రే బాల్ థాక్రేకి వారసుడు కారని చెప్పడమే రాజ్ ఉద్దేశ్యం. మరో వైపు చూస్తే ఇటీవల బీజేపీ ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా శివసేన వ్యవహరించాల్సి వచ్చింది.
దానికి కారణం మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలే అని అంటున్నారు. శివసేనకు ఉన్న హిందూత్వ ఓటు బ్యాంక్ ని ఒడిసి పట్టుకోవడానికి రాజ్ ఠాక్రే చూస్తున్నారు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎన్సీపీలతో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. రానున్న రోజులలో వీర హిందూత్వను రాజ్ మరింతగా ముందుకు తెస్తారు. అది ఉద్ధవ్ కి ఇబ్బందికరమే అని అంటున్నారు.
ఇక ఏక్ నాధ్ షిండేతో వంటి మాస్ లీడర్ సీఎం గా ఉంటూ శివసేనను చీల్చాల్సింది చీల్చారు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ చాణక్యం మీద ఆయన నాయకత్వ పటిమ మీద ఇపుడు అందరి చూపు ఉంది. ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక రాజ్ ఠాక్రే ఎంతో కొంత తన సత్తా చాటుకుంటే అపుడు శివసేనలోని అసలు సిసలు లీడర్లు ఆయన వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది.
అదే విధంగా చూస్తే రాజ్ ఠాక్రే దూకుడు వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన ఉద్ధవ్ థాక్రేల కూటమిలో చిచ్చు రేగుతోంది. ఈ మొత్తం పరిణామాలు రానున్న రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరికి మేలు చేస్తాయి ఎవరికి నష్టం చేకూరుస్తాయి అన్నది చూడాల్సి ఉంది.