'ఇండియా' కూటమి సంచలన నిర్ణయం.. రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాసం!
శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు విపక్షల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. రోజుకో విషయం వైరల్ గా మారుతోంది.
By: Tupaki Desk | 9 Dec 2024 12:03 PM GMTశీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు విపక్షల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. రోజుకో విషయం వైరల్ గా మారుతోంది. తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు వద్ద నోట్ల కట్ట దొరికిందంటూ ఎగువసభలో ఛైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు.. ఆయన వ్యవహార శైలిని తప్పుబట్టారు. మరోపక్క ప్రధానంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలను ప్రస్థావిస్తున్నప్పటికీ విపక్షాల పనికి ఫలితం దక్కడం లేదని అంటున్నారు.
ఈ సమయంలో అడ్డగోలు ఆరోపణలకే అధికారపక్షం పరిమితమవుతూ, విషయాన్ని తప్పుదోవపట్టించే ప్రయత్నంలో బిజీగా ఉందని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీంతో.. ఉభయసభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభ ఛైర్మన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విపక్షాలు అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నాయి!
అవును... రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీతో రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించి తాము మద్దతివ్వడమా.. లేక, ఇండియా కూటమి అంతా కలిసి తీర్మానం పెట్టడమా అనే విషయంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా.. జార్జ్ సోరోస్ తో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయంటూ అధికార పక్షం విమర్శలు గుప్పించింది. దీంతో... సభలో మరోసారి రగడ మొదలైంది. ఈ సమయంలో.. ఛైర్మన్ ధన్ కర్ అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని.. ప్రతిపక్షం పట్ల చిన్న చూపు చూస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఇండియా కూటమి నేతలంతా ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది. అయితే... రాజ్యసభలో తాజాగా మెజారిటీలోకి వచ్చిన అధికార ఎన్డీయే అవిశ్వాసాన్ని అడ్డుకునే అవకాశాలుండగా.. అద్భుతం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమనే చర్చా తెరపైకి వచ్చింది.
కాగా.. ఇటీవల ఉప ఎన్నికల తర్వాత రాజ్యసభకు 234 మంది ఎంపీలున్న సంగతి తెలిసిందే. వీరిలో బీజేపీకి 96 మంది, ఎన్డీయే కూటమికి 113 మంది ఎంపీలున్నారు. ఇక ఆరుగురు నామినేటెడ్ ఎంపీలు అధికార పక్షంవైపే ఉంటారు. దీంతో... సాధారణ మెజారిటీ (117) కంటే ఎన్డీయే బలం (119) ఎక్కువగానే ఉంది.
ఇక రాజ్యసభలో కాంగ్రెస్ కు 27 మంది ఎంపీలుండగా.. విపక్ష ఎంపీలంతా కలిస్తే ఆ సంఖ్య 90 కి చేరుతుంది. మరి ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందా.. లేక, ఏదైనా అద్భుతం జరిగి ధన్ కర్ కు షాక్ తగులుతుందా అనేది వేచి చూడాలి!