Begin typing your search above and press return to search.

పాపం మోపిదేవి... ఆ ఇద్దరూ మళ్లీ రాజ్యసభకు !

ఏపీలో ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామా వలన ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు టీడీపీ కూటమి అభ్యర్ధులు ఖరారు అయ్యారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 12:30 PM
పాపం మోపిదేవి... ఆ ఇద్దరూ మళ్లీ రాజ్యసభకు !
X

ఏపీలో ముగ్గురు వైసీపీ ఎంపీల రాజీనామా వలన ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు టీడీపీ కూటమి అభ్యర్ధులు ఖరారు అయ్యారు. వైసీపీ ఎంపీలుగా ఉంటూ ఆ పార్టీ ఓటమి తరువాత టీడీపీలోకి వచ్చిన బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకీ తమ పదవులకు ఆగస్టులోనే రాజీనామా చేశారు.

ఇక మరుసటి నెలలో మరో ఎంపీ ఆర్ క్రిష్ణయ్య కూడా వైసీపీకి తన ఎంపీ పదవికీ గుడ్ బై కొట్టేశారు. దాంతో ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ సీట్లలో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్ధులు రేసులోకి వచ్చారు.

అనేక పేర్లు సైతం వినిపించాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు ఈసారి పక్కాగా రాజ్యసభకు వెళ్తారు అని అంతా అనుకున్నారు. రాజ్యసభకు ఎన్నికల షెడ్యూల్ రావడమేంటి నాగబాబు పేరే మారుమోగింది. అదే విధంగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, వర్ల రామయ్య, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి.

అయితే మూడు ఖాళీలలో చివరికి అభ్యర్ధులు ఫైనల్ అయ్యారు. అందులో బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ లను ఎంపిక చేశారు. దాంతో టీడీపీ కూటమి తరఫున ఎవరు రాజ్యసభకు వెళ్తారు అన్న ఉత్కంఠకు తెర పడింది. ఈ నెల 10న నామినేషన్లు దాఖలుకు చివరి రోజు కావడంతో ఈ ముగ్గురూ తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ నుంచి రాజీనామాలు చేసి బయటకు వచ్చిన ముగ్గురు ఎంపీలలో తిరిగి ఇద్దరు మళ్లీ రాజ్యసభ మెట్లెక్కుతున్నారు. వారే బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్య, బీద టీడీపీ నుంచి, ఆర్ క్రిష్ణయ్య బీజేపీ నుంచి తన మిగిలిన పదవీ కాలానికి కొనసాగడానికి నామినేట్ అవుతున్నారు.

అయితే మోపిదేవికే ఆ చాన్స్ దక్కలేదు. ఆయన ప్లేస్ లో సానా సతీష్ ని ఎంపిక చేశారు. ఈయన భారీ పారిశ్రామికవేత్త అని అంటున్నారు. ఇక మోపిదేవికి ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక దానిని ఇస్తారని చెప్పినట్లుగా ప్రచారం సాగింది.

ఏపీ శాసనమండలిలో చూస్తే ఇప్పటికి దాకా నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు. దాంతో అక్కడ ఎపుడు ఖాళీలు అధికారికంగా ఏర్పడతాయి ఎపుడు ఎన్నికలు జరుగుతాయి. ఎపుడు మోపిదేవికి చాన్స్ వస్తుంది అన్నది అయితే తెలియదు అంటున్నారు

అదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీల నుంచి ఎంతో మంది ఆశావహులు ఎమ్మెల్సీ పదవుల మీద ఆశలు పెంచుకుని ఉన్నారు. వారితో పాటుగా అనేక మంది ఇతర నాయకులు ఎమ్మెల్యే సీటు దక్కని వారు ఇలా లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. ఒకసారి రాజీనామా చేసి పదవిని వదులుకున్న తరువాత మళ్లీ పదవి దక్కడం అంటే అంత ఈజీ అయితే కాదు. 2026 జూన్ వరకూ పెద్దల సభలో పదవీకాలం ఉన్న మోపిదేవి టీడీపీ అధినాయకత్వం తో ఏమి మాట్లాడుకుని రాజీనామా చేశారో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఖాళీగానే ఉన్నారని అంటున్నారు.

పైగా ఆయన సొంత నియోజకవర్గం రేపల్లెలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బలమైన నాయకుడు. ఆయనను కాదని మోపిదేవికి పార్టీ చాన్స్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తుందా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి

మోపిదేవి ఈ రాజ్యసభ రాజీనామాల విషయంలో తన రాజకీయాన్ని సరిగ్గా పదును పెట్టుకోలేకపోయారా అన్న డిస్కషన్ అయితే సాగుతోంది.