Begin typing your search above and press return to search.

పెద్దల సభలో పెద్దలు... దిమాక్ కరాబ్ చేసే ఆస్తులు, నేరాలు!

భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా.. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమా.. లేక, పేద దేశమా

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:12 AM GMT
పెద్దల సభలో పెద్దలు... దిమాక్ కరాబ్ చేసే ఆస్తులు, నేరాలు!
X

భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా.. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమా.. లేక, పేద దేశమా.. ఆ డిస్కషన్ సంగతి కాసేపు పక్కనపెడితే.. దేశ సంపద అతి తక్కువ మంది దగ్గరే ఉండిపోయిందనే మాటలకు, ఆర్థిక అసమానతలు అత్యంత బలంగా ఉన్నాయనే వాదనకూ బలం చేకూర్చే విషయం ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. భారత పార్లమెంటు లో అత్యధిక ధనవంతుల లిస్ట్ వెలుగులోకి వచ్చింది.

అవును... రాజ్యసభలోని మొత్తం 233 మంది సభ్యులకు గానూ సుమారు 225 మంది రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్.ఇ.డబ్ల్యూ) లు ఒక నివేదిక విడుదల చేశాయి.

ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల పెద్దల సభ ఎంపీలకు సంబంధించిన ఆస్తుల విలువ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో 18 మంది ఎంపీలు ఉండగా.. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ. 9,419 కోట్లు అని ఈ నివేదిక తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం.. రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న మొత్తం 11 మంది ఎంపీలలో ఐదుగురు, తెలంగాణ నుంచి ఉన్న మొత్తం ఏడుగురు ఎంపీలలో ముగ్గురు, మహారాష్ట్రలో మొత్తం 19మందికి గానూ ముగ్గురు, ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఎంపీలలో ఒక్కరు, పంజాబ్ లోని ఏడుగురు ఎంపీలలో ఇద్దరు, హర్యానాలోని ఐదుగురు ఎంపీలలో ఒకరు, మధ్య ప్రదేశ్ లోని 11 మంది ఎంపీలలో ఇద్దరు ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ. 100 కోట్లుగా ప్రకటించినట్లు పేర్కొంది.

ఇక ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ. 5596 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 3823 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 30 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు విలువ రూ.1941 కోట్లుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

వీరిలో ఏడుగురు బీఆరెస్స్ రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తుల విలువ రూ.799.46 కోట్లు కాగా.. ఆ తర్వాత తొమ్మిది మంది వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కో ఎంపీకి రూ.395.68 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇదే సమయంలో 10 మంది ఆప్ రాజ్యసభ ఎంపీల సగటు ఆస్తులు ఒక్కో ఎంపీకి రూ.131.66 కోట్లు అని నివేదిక హైలైట్ చేసింది.

ఇదే సమయంలో నలుగురు రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీల ఆస్తులు రూ. 10 లక్షల లోపే ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీరిలో ఆప్‌ కి చెందిన సంత్ బల్బీర్ సింగ్ ఆస్తుల విలువ రూ.3.79 లక్షలు, సంజయ్ సింగ్‌ కు రూ.6.6 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్‌ కు చెందిన ప్రకాష్ చిక్ బరాక్‌ కు రూ.9.25 లక్షల ఆస్తులుండగా.. బీజేపీకి చెందిన మహారాజా సనాజయోబా లీషెంబా ఆస్తుల విలువ రూ.1.98 లక్షలు!

ఏది ఏమైనా... మొత్తంగా చూస్తే 225 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ. 18,210 కోట్లని ఈ నివేదిక తెలిపిది.

పెద్దల సభలో కోటీశ్వరులే కాదు.. క్రిమినల్ కేసులున్న పెద్దలు కూడా ఎక్కువగానే ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇందులో భాగంగా... మొత్తం 225 మంది సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని పేర్కొంది. వీరిలో 41 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండగా.. మరో ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది.

ఇదే క్రమంలో... బీజేపీకి చెందిన 85 మంది సభ్యుల్లో 23 మందిపైనా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 సభ్యుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌ లో పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ఓవరాల్ గా నలుగురు ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులు ఉండగా.. వీరిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పై అత్యాచార కేసు నమోదైనట్లు తెలిపింది.

ఇక మిగిలిన రీజనల్ పార్టీల విషయానికొస్తే... టీఎంసీకి చెందిన 13 మంది, ఆర్జేడీ నుంచి నామినేట్ అయిన ఐదుగురు, సీపీఐ నుంచి నలుగురు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు, వైసీపీ నుంచి ముగ్గురు, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.