Begin typing your search above and press return to search.

టీడీపీ రాజ్యసభ ఆశలపై వైసీపీ మార్క్ వేటు...!

తెలుగుదేశం పార్టీని తక్కువగా అంచనా వేస్తే గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ కి ఝలక్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   9 Jan 2024 2:30 AM GMT
టీడీపీ రాజ్యసభ ఆశలపై వైసీపీ  మార్క్ వేటు...!
X

తెలుగుదేశం పార్టీని తక్కువగా అంచనా వేస్తే గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ కి ఝలక్ ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒడుపుగా నలుగురు సభ్యులను తన వైపునకు తిప్పుకుంది. దీంతో వైసీపీ నిలబెట్టిన ఆరవ అభ్యర్ధి ఓటమి పాలు అయ్యారు. ఇక సీన్ కట్ చేస్తే రాజ్యసభ ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి.

ఈసారి మార్చిలో ముందుగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఆ మీదట అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు ఎంపీలు ఈసారి రిటైర్ అవుతున్నారు. బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రిటైర్ అవుతున్నారు. వీరి ముగ్గురి రాజ్యసభ పదవీ కాలం ముగిసినట్లే.

దాంతో ఈ మూడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న మెజారిటీ ప్రకారం చూస్తే వైసీపీ విజయం సునాయాసం అని చెప్పాలి. అయితే ఇక మూడు ఎంపీ సీట్లు కాబట్టి మొత్తం 175 ఎమ్మెల్యేలను మూడుగా విభజిస్తారు. అపుడు ఒక్కో సభ్యుడు గెలవడానికి 59 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి అవుతుంది. ఇక టీడీపీకి చూస్తే నిక్కచ్చిగా 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు

రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీని నిలబెట్టినా గెలవాలి అంతే మరో నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే వైసీపీ ఇపుడు మార్పు చేర్పులలో భాగంగా దాదాపుగా యాభై నుంచి అరవై మంది దాకా ఎమ్మెల్యేల సీట్లలో షఫలింగ్ చేస్తోంది. కొందరికి టికెట్లు నో అంటోంది. దాంతో పాటు వైసీపీకి నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

టికెట్లు రాని వారు అసంతృప్తిగా ఉంటే ఆ ఓటు కోసం టీడీపీ తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుంది. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు చాణక్యం చూపిస్తారు అని అంటున్నారు. ఈ దఫా నెగ్గిన ఎమ్మెల్యేలకు ఉండే చివరి ఓటు చాన్స్ ఇదే కావడంతో పాటు టీడీపీ వైపున బిగ్ షాట్స్ కొందరు పోటీకి దించమని కోరుతున్నారని అంటున్నారు

దాంతో ఈ ఎన్నికల్లో ప్రలోభాలు కూడా కచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో టీడీపీ రాజకీయ వ్యూహాలు ఏంటో వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ గమనించింది. దాంతో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదు అని వైసీపీ భావిస్తోంది.

అందుకే రాజ్యసభ ఎన్నికల కంటే ముందే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నలుగురి మీద అనర్హత వేటు వేయడానికి రెడీ అవుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల మీద అనర్హత వేటు కోసం వైసీపీ స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. అలాగే ఇటీవలే జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్, అలాగే టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యల మీద వేటు వేయడానికి కూడా ఆ పార్టీ ఫిర్యాదు చేస్తోంది.

అయితే రాజ్యసభ ఎన్నికలు ముగిసేవరకూ కొంతమంది వైసీపీలో ఉండి చివరిలో పార్టీకి యాంటీగా ఓట్లు వేస్తే దాని సంగతేంటి అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే ఇపుడే వారు బయటకు వస్తే కచ్చితంగా అనర్హత వేటుకు గురి అవుతారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం వైసీపీ మూడు ఎంపీ సీట్లను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది అని అంటున్నారు.