వర్మ పోలీస్ స్టేషన్ కు షాపులు మూసేయాలా.. ఏందిది?
ఒక కేసు విచారణ కోసం హాజరైన ఒక ప్రముఖుడి కోసం అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు అందరిని విస్మయానికి గురి చేసింది.
By: Tupaki Desk | 8 Feb 2025 5:04 AM GMTఒక కేసు విచారణ కోసం హాజరైన ఒక ప్రముఖుడి కోసం అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు అందరిని విస్మయానికి గురి చేసింది. వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ.. సంచలనాల పేరుతో సినిమాలు నిర్మించే దర్శకుడిగా సుపరిచితుడైన రాంగోపాల్ వర్మ విచారణ వేళ.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం అనే మూవీని వర్మ తీయటం తెలిసిందే.
ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు..పవన్ కల్యాణ్.. నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా మార్పింగ్ చిత్రాలను ఎక్స్ లో పోస్టు చేయటం..దీనిపై టీడీపీ మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఈ కేసు విచారణకు డుమ్మా కొట్టేందుకు చాలానే ప్రయత్నించి రాంగోపాల్ వర్మ.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ఇదంతా బాగానే ఉన్నా.. విచారణలో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వర్మ హాజరయ్యే వేళకు కాస్త ముందుగానే స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా సిబ్బందిని మొహరించటం ఒక ఎత్తు అయితే.. ప్రత్యేక రోప్ లను సైతం సిద్ధం చేశారు. రాంగోపాల్ వర్మకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు చేసి ఉంటారని భావించినా.. అక్కడ ఎవరిని ఉంచకుండా వ్యవహరించటం గమనార్హం.
అంతేకాదు.. పోలీస్ స్టేషన్ కు సమీపంలోని షాపులను కూడా మూసివేయించారు. విచారణ గంటల పాటు సాగటం.. విచారణ పూర్తై తిరిగి వెళ్లే వరకు షాపులు క్లోజ్ చేసి ఉండాలన్నఆదేశాలపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. స్టేషన్ కు వర్మ ప్రయాణిస్తున్న వాహనం తేలిగ్గా వచ్చేందుకు వీలుగా సర్వీసు రోడ్డులో రాకపోకల్ని నిలిపివేశారు. ఇతరులు రాకుండా పోలీసు వాహనాల్ని అడ్డుగా పెట్టి మరీ రాచమర్యాదలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరయ్యే ప్రముఖుడికి ఇంతటి అర్బాటమా?అన్నది ప్రశ్నగా మారింది.