విచారణకు వెళ్లకుండా ఈ పరుగులేంది రాంగోపాల్ వర్మ?
చట్టానికి చుట్టాలు ఎవరూ ఉండరు. అందరూ చట్టం ఎదుట సమానమేనని చెప్పటం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Nov 2024 4:45 AM GMTచట్టానికి చుట్టాలు ఎవరూ ఉండరు. అందరూ చట్టం ఎదుట సమానమేనని చెప్పటం తెలిసిందే. మరి.. అదే నిజమైనప్పుడు నోటీసులు అందుకున్న ఒక ప్రముఖుడు.. తాను విచారణకు హాజరైతే తన కారణంగా నిర్మాతకు కోట్లాది రూపాయిలు నష్టం వస్తుందన్న మాట చెప్పటంలో అర్థముందా? అన్నది ప్రశ్న. ఒకవేళ.. నిర్మాతకు కోట్లాది రూపాయిల నష్టం వచ్చేదే నిజమైతే.. ఆ నష్టం జరగకుండా ఉండేందుకు నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా? నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం లాంటివి చేయటమే కాదు.. అంతా నా ఇష్టం అంటూ తనదైన సిద్ధాంతాల్ని.. ఆదర్శాల్ని గొప్పగా చెప్పుకునే వర్మ.. తనకు మించి ఓపెన్ గా ఉండేవారెవరూ ఈ ప్రపంచంలో ఉండరన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.
అంతే కాదు తెగువకు.. తెంపరితనానికి తాను మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా అన్నట్లు వ్యవహరిస్తారు. నిజంగానే వర్మ మాటలకు తగ్గట్లే ఆయన బిహేవియర్ ఉండాలి కదా? కానీ.. అందుకు భిన్నంగా ఏపీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులపై తన లాయర్ల ద్వారా స్పందించటం.. తన ఫోన్ ను స్విచ్ఛాప్ చేసి ఉంచుకోవటం.. పోలీసులకు అందుబాటులోకి రాకుండా.. తాను ఎక్కడ ఉన్న విషయాన్ని వెల్లడించకుండా దాగుడుమూతలు ఆడాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న.
ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటమే కాదు.. నిజ జీవితంలోని కొందరు ప్రముఖ నేతలను.. వారి ముఖాలకు దగ్గరగా ఉండే నటులను తీసుకొని.. వారితో సినిమాలు చేయటం.. తన ఊహా శక్తికి తగ్గట్లు.. సదరు పాత్రల చేత ఇష్టారాజ్యంగా వ్యవహరించేలా చేసి.. తాను కోరుకున్నట్లుగా సినిమాను పూర్తి చేసి జనాల మీదకు వదలటం.. ఈ సందర్భంగా కొన్ని పాత్రల్ని కామెడీగా.. చేతకానివాడిలా.. బపూన్ మాదిరి చూపించిన రాంగోపాల్ వర్మ సినిమాల గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నెల క్రితం కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు రావాలంటూ ఒంగోలు గ్రామీణ పోలీసులు వర్మకు నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని ఆయన ఆఫీసులో నోటీసులు ఇచ్చారు. నోటీసులో పేర్కొన్న దాని ప్రకారం నవంబరు19న ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్ బాబు ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ.. హాజరు కాలేదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అందుకు అంగీకరించని కారణంగా వారం టైం ఇవ్వాలంటూ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు.
తాను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నానని.. ముందుగా అనుకున్న కారణంగా షూటింగ్ కు వెళ్లకుంటే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు. పోలీసుల నుంచి సమాధానం లేకపోవటంతో లాయర్ ద్వారా లేఖ పంపి వ్యక్తిగత హాజరుకు టైం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న (సోమవారం) విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మరోసారి హైకోర్టులో బెయిల్ పిటిసన్ దాఖలు చేశారు. మరోవైపు వర్మ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవటంతో.. హైదరాబాద్ లోని ఆయన ఆఫీసుకు వెళ్లారు ఏపీ పోలీసులు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవటం.. ఫోన్ సైతం స్విచ్ఛాప్ చేసి ఉండటంతో.. ఉద్దేశపూర్వకంగానే తమను తప్పు దారి పట్టించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో.. వర్మ కనిపించకుండా పోయారన్న ఉద్దేశంతో ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇప్పటివరకు నోటీసులు ఇచ్చి.. విచారణకు వెయిట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు ఏకంగా ఆయన్ను గుర్తించి అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.