Begin typing your search above and press return to search.

"వ్యూహం కోసం ఫైబర్ నెట్!"... ఆ న్యూస్ ఛానల్స్ కు ఆర్జీవీ వార్నింగ్!

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విడుదలైన ‘యాత్ర-2’, ‘వ్యూహం’ చిత్రాలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Dec 2024 11:07 AM GMT
వ్యూహం కోసం ఫైబర్  నెట్!... ఆ న్యూస్ ఛానల్స్ కు ఆర్జీవీ వార్నింగ్!
X

గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విడుదలైన ‘యాత్ర-2’, ‘వ్యూహం’ చిత్రాలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు ఆర్జీవీ మార్కుతో తెరకెక్కిన మరికొన్ని చిత్రాలు రాజకీయంగా సందడి చేశాయి! అయితే... ఈ చిత్రాల్లో కొన్నింటికి నాటి జగన్ సర్కార్ నుంచి గట్టి మద్దతు లభించిందంటూ ఓ న్యూస్ ఛానల్ లో సంచలన కథనాలు వచ్చాయి.

జగన్ సీఎంగా ఉన్న సమయంలో పైన పేర్కొన్న సినిమాల్లో కొన్నింటికి కోట్లు ఖర్చు చేశారని.. ఏపీ ఫైబర్ నెట్ డిపార్ట్ మెంట్ "వ్యూహం" సినిమా కోసం రూ.1.10 కోట్లను ఓ ప్రైవేటు కంపెనీకి బదిలీ చేసిందని.. "యాత్ర-2" కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరో కోటి మళ్లించారని ఆ న్యూస్ ఛానల్ కథనాలు ప్రసారం చేసింది! దీనిపై ఆర్జీవీ సీరియస్ గా స్పందించారు.

అవును... వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన పలు సినిమాలకు ఏపీ ఫైబర్ నెట్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ డిపార్ట్ మెంట్స్ నుంచి నగదు బదిలీ జరిగిందంటూ ఓ న్యూస్ ఛానల్ లో కథనాలు ప్రసారమవ్వడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై క్లారిటీ కమ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు!

ఇందులో భాగంగా... "వ్యూహం" సినిమాకు దాసరి కిరణ్ కుమార్ నిర్మాత కాగా.. శ్రీకాంత్ ఫైనాన్స్ అందించారని.. ఆ ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుంచి ఏపీ ఫైబర్ నెట్ ప్రసారహక్కులను తన పార్ట్ నర్ రవివర్మ సొంతంగా కొనుగోలు చేశారని.. అనంతరం రవివర్మ నుంచి ఏపీ ఫైబర్ నెట్ ప్రసారహక్కులను రెండూ కోట్లకు కొనుగోలు చేసిందని తెలిపారు.

అయితే వాటిలో ఒక కోటి రూపాయలు మాత్రమే అకౌంట్ కు వచ్చిందని.. ఇది శ్రీకాంత్ - రవివర్మలకు సంబంధించిన ఒప్పందం అని తెలిపారు. వాస్తవానికి ఈ హక్కులు ఏపీ ఫైబర్ నెట్ కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయని.. ఈ సందర్భంగా ఫైబర్ నెట్ చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్ ను సొంతం చేసుకుందని వెల్లడించారు.

ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ కు టీడీపీ ఫిర్యాదు చేయడంతో ప్రసారాలను నిలిపివేశారని.. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ను ఏపీ ఫైబర్ నెట్ నిలిపివేసిందని వెల్లడించారు. దీంతో.. ఏపీ ఫైబర్ నెట్ తన బకాయి మొత్తం చెల్లించలేదనే కారణంతో తన పార్టనర్ రవివర్మ సివిల్ కోర్టులో కేసు పెట్టారని తెలిపారు.

ఈ నేపథ్యంలో రవివర్మ పైనా, తనపైనా తప్పుగా ప్రచారం చేసి.. తమ పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవీ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నామని వర్మ ఎక్స్ వేదికగా వెళ్లడించారు.