'ఐ లవ్ ఒంగోల్ పోలీస్' ట్వీట్ వెనుక ఇంత ఎటకారమా వర్మ?
ఎవరైనా ఏమైనా అనుకుంటారన్నదేమీ లేకుండా బరితెగింపునకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఆయనకు చట్టాలు సైతం క్రమశిక్షణ నేర్పించకపోవటం చూసినప్పుడు.. వర్మ మేధావితనానికి ముచ్చట పడాల్సిందే.
By: Tupaki Desk | 9 Feb 2025 5:19 AM GMT‘నాకు కాస్త తిక్క ఉంది. దానికో లెక్క ఉంది’ అంటూ పవన్ కల్యాణ్ సినిమా డైలాగ్ కు తీసిపోని విధంగా.. రియల్ లైఫ్ లో తాను మాట్లాడే మాటలకు.. తాను చేసే ట్వీట్లను లెక్కతో చేసే ప్రముఖుడిగా రాంగోపాల్ వర్మను చెప్పాలి. పొగిడినట్లే పొగిడి.. అందులో ఎటకారాన్ని మేళవించటం వర్మకు మాత్రమే సాధ్యం. అదురుబెదురు లేని రీతిలో ఆయన వ్యవహరించే తీరు చూసినప్పుడు వర్మ.. వర్మనే అనుకోకుండా ఉండలేని పరిస్థితి. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్నదేమీ లేకుండా బరితెగింపునకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఆయనకు చట్టాలు సైతం క్రమశిక్షణ నేర్పించకపోవటం చూసినప్పుడు.. వర్మ మేధావితనానికి ముచ్చట పడాల్సిందే.
‘వ్యూహం’ చిత్ర ప్రచార సమయంలో నాటి విపక్ష నేతలు చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేయటమే కాదు.. అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మను ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావటం (హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే) తెలిసిందే.
విచారణ ముగించుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఆయనో ట్వీట్ చేశారు. ‘ఐ లవ్ ఒంగోల్. అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్, త్రీ ఛీర్స్’ అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఒక కేసుకు సంబంధించిన విచారణకు హాజరై.. తిరిగి వెళ్లే వేళలో ఈ తరహా ట్వీట్ పెట్టటం ఇప్పటివరకు ఏ ప్రముఖుడు చేయనిది. అంతేకాదు.. పోలీసుల్ని పొగిడినట్లుగా కనిపిస్తూనే.. కొట్టొచ్చినట్లుగా ఉండే ఎటకారాన్ని నింపిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
దీని వెనకున్న అసలు విషయం గురించి తెలిసినప్పుడు మాత్రం ఔరా.. వర్మా? అని అనుకోకుండా ఉండలేం. గంటల తరబడి తనను ప్రశ్నించినా ఏమీ చేయలేకపోయారన్న ఎద్దేవాతోనే ఇలా చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ ఆ రోజు అసలేం జరిగిందన్న విషయంపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు వర్మ. దాదాపు గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఐ ఛాంబర్ లోకి వెళ్లిన వర్మను పోలీసులు ప్రశ్నలు వేశారు. ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెప్పని వర్మ.. విచారణ వేళ చెప్పింది పెద్దగా ఏమీ లేదంటున్నారు. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చి.. సాయంత్రం నాలుగు గంటల వేళలో మళ్లీ విచారణ మొదలుపెట్టారు. అది కాస్తా తొమ్మిది గంటల వరకు సాగింది. విచారణలో భాగంగా సెల్ ఫోన్ ను తమకు అప్పగించాలని కోరగా.. తన మేనల్లుడి వద్ద కారులో వదిలి వచ్చానని.. సదరు కారు హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లుగా చెప్పారు. దీంతో.. ఏమీ చేయలేని పరిస్థితి.
ఫోన్ తన వద్ద లేదని చెప్పి.. తన మేనల్లుడి దగ్గర ఫోన్ ఉంచానని.. అతను.. ఆ వాహనం హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు చెప్పిన వర్మ.. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే సోషల్ మీడియాలో పోస్టు ఎలా పెట్టారు? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. తన ఫోన్ ఎక్కడ ఉందన్న లొకేషన్ ను పోలీసులు గుర్తించినప్పటికీ.. ఏమీ చేయలేకపోయారన్న విషయాన్ని కాస్తంత ఎటకారంగా తన ట్వీట్ తో వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి విచారణ వేళ వర్మ ఫోన్ గురించి అడగటం.. అది హైదరాబాద్ కు వెళ్లిపోయిందన్న మాట చెప్పిన వేళలో.. ఆయన ఫోన్ నెంబరును పోలీసులు ట్రాక్ చేయగా.. అది ఒంగోలు వైసీపీ జిల్లా పార్టీ ఆఫీసు ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఫోన్ కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు.. పనిలో పనిగా వైసీపీ ఆఫీసుకు వెళ్లగా.. అక్కడున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగటం.. వర్మ ఫోన్ తమ దగ్గర ఎందుకు ఉంటుందని రెట్టించిన స్వరంతో అడగటంతో మరేమీ చేయలేక బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసులను పొగుడుతూ వర్మ ట్వీట్ చేయటం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి తెలిసిన వారంతా పోలీసులపై వర్మ చేసిన ట్వీట లోగుట్టు అర్థమై.. ఉడుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది.