'వ్యూహం' ఉద్దేశం ఏంటి? : వర్మకు సూటి ప్రశ్న
ఈ క్రమంలో ఒంగోలు పోలీసుల ఎదుట వర్మ ఎట్టకేలకు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. వర్మను విచారిస్తున్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 10:43 AM GMTసంచలన, వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. దుర్భాషలు, వివాదాస్పద పోస్టుల నేపథ్యంలో వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒంగోలు పోలీసుల ఎదుట వర్మ ఎట్టకేలకు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. వర్మను విచారిస్తున్నారు. తొలుత ఆయన సినిమాల గురించి.. తర్వాత రాజకీయ ప్రాధాన్యం.. వైసీపీకి అనుకూలంగా మద్దతు ఇస్తున్న అంశాలపై ప్రశ్నలు కురిపించారు.
ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ఉద్దేశాన్ని నిలదీశారు. ఎవరిని హైప్ చేయాలని అనుకున్నారు? ఈ సినిమాకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరు తీయమన్నారు? అనే ప్రశ్నలు కూడా.. అడిగినట్టు తెలిసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల విషయంపై కూడా.. సీఐ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ పోస్టులకు కర్త-కర్మ-క్రియ ఎవరు? ఎవరు ప్రోత్సహిస్తే.. ఈ పోస్టులు పెట్టారు? అంటూ.. నిలదీశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేయడం తప్పా? అని ఈ సందర్భంగా వర్మ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.
అయినా.. తన ఉద్దేశాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదని.. ఒక దర్శకుడిగా.. తనకు ఉండే స్వేచ్ఛతోనే వ్యూహం సినిమాను రూపొందించినట్టు వర్మ జవాబు ఇచ్చారు. దీనిని నిర్మాత ఉన్నారని.. ఆయన ఎక్కడ నుంచి డబ్బులు తెచ్చారనే విషయం నాకు సంబంధించిన విషయం కాదని కూడా గడుసు గానే ఆన్సర్ ఇచ్చినట్టు తెలిసింది. సోషల్ మీడియాలో తాను ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని.. ఎవరికైనా మనసుకు గాయపడి ఉంటే.. లైట్ తీసుకోవచ్చని.. చెప్పారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ విమర్శిస్తున్నారని.. తనను కూడా దూషిస్తున్నారని.. అంత మా త్రాన భావప్రకటనా స్వేచ్ఛనునిలిపి వేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు.. సినిమా ఇండస్ట్రీకి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని.. పన్నులు కట్టించుకుంటున్నారని.. చార్జీలు వసూలు చేస్తున్నారని..అలాంటప్పుడు ప్రభుత్వాలతో సినిమా రంగానికి సంబంధం ఏంటి? అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కూడా.. తనదైన శైలిలో వర్మ చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.