తెలుగోడి సత్తా.. ఎస్‌బీఐ చైర్మన్‌గా.. ఎండీగా..
ఏ రంగంలో చూసినా తెలుగోడు సత్తా చాటుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రంగాల్లో తమ హవా సాగిస్తున్నారు.
By: Tupaki Desk | 19 Dec 2024 9:53 AM GMTఏ రంగంలో చూసినా తెలుగోడు సత్తా చాటుతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన రంగాల్లో తమ హవా సాగిస్తున్నారు. ఇక.. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తెలుగోడు అంటే ఏంటో నిరూపిస్తున్నారు. చివరకు అమెరికాలోని ట్రంప్ కేబినెట్‌లో సైతం తెలుగు వారు స్థానం సంపాదించారు. తాజాగా మరో దిగ్గజ బ్యాంకుకు మన తెలుగోడు ఎండీగా నియామకం అయ్యారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా తెలుగువాడైన అమర రామమోహన్‌రావు నియామకం అయ్యారు. కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థాగత ఆర్థిక సేవల బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ మేరకు రామమోహన్‌రావును పేరును ప్రతిపాదించింది. గత సెప్టెంబరులో ఆయన పేరును ప్రతిపాదిస్తూ సిఫారసు చేసింది. దీంతో ఆయన నియామకానికి కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. రామమోహన్‌రావు మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు.
రామమోహన్‌రావు ఇంజినీరింగ్ చదివారు. 1991లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ ఎండీగా కొనసాగుతున్నారు. 33 ఏళ్ళుగా ఆయన ఎస్‌బీఐలోనే వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా కీలక బాధ్యతల్లో కొనసాగారు. గతేడాది ఆగస్టు వరకు ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్ ఎండీగా కొనసాగారు. అలాగే సీఈఓగానూ పనిచేశారు. అంతకుముందు ఎస్‌బీఐ భోపాల్ సర్కిల్ సీజీఎంగానూ సేవలు చేశారు. అలాగే.. సింగపూర్, అమెరికా దేశాల్లోని ఎస్‌బీఐల్లోనూ కీలకంగా పనిచేశారు.
రామమోహన్‌రావు పనితీరు ఆధారంగా.. ఆయన పదవీ కాలాన్ని 2028 ఫిబ్రవరి 29వరకు పొడగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే.. తెలుగువారైన శ్రీనివాసులు శెట్టి ఇప్పటికే ఎస్‌బీఐ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎండీగా కూడా తెలుగువారే నియామకం అయ్యారు. ఎస్‌బీఐ చరిత్రలో ఇద్దరు తెలుగు వారు ఒకే సమయంలో రెండు కీలక బాధ్యతల్లో కొనసాగడం ఇదే మొదటిసారి. శ్రీనివాసులు శెట్టి అంతకుముందు ఎస్‌బీఐ ఎండీగా పనిచేశారు. ఆయన స్థానంలోనే రామమోహన్‌రావు నియామకం అయ్యారు.