Begin typing your search above and press return to search.

జగన్ పుంగనూరు పర్యటన రద్దుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట ఎలా ఉంటుందో? ఏ విషయానికి ఎంతలా రియాక్టు అవుతారో తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2024 4:21 AM GMT
జగన్ పుంగనూరు పర్యటన రద్దుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట ఎలా ఉంటుందో? ఏ విషయానికి ఎంతలా రియాక్టు అవుతారో తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిగా వ్యవహరిస్తూ.. మాట వరసకు చంద్రబాబును ఆయన పరివారాన్ని ఉద్దేశించి పాజిటివ్ మాట నోటి నుంచి రావటం అన్నది కనిపించదు. అలాంటి పెద్దిరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయంగా సంచలనంగా మారాయి.

ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ హత్య హత్యాచారంగా ప్రచారం జరిగింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నేత్రత్వంలోని కూటమి సర్కారు చిన్నారుల ప్రాణాల్ని కాపాడటంలో వైఫల్యం చెందినట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే.. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే తప్పించి.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగినట్లుగా అత్యాచారం కాదన్న విషయాన్ని పోలీసులు తేల్చేశారు.

ఈ కేసుకు సంబంధించి ఒక మైనర్ బాలుడు.. ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి తండ్రి స్థానిక మహిళ హసీనా వద్ద రూ.3.5లక్షలు అప్పుగా తీసుకోవటం.. చెప్పిన సమయానికి అప్పు తిరిగి ఇవ్వలేదు. దీంతో డబ్బు కోసం అడిగిన మహిళను తిడుతూ.. సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరింపులకు దిగాడు.దీంతో సదరు మహిళ పగ పెంచుకుంది. ప్రతీకారంతో రగిలిపోయిన ఆమె.. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని తన వెంట తీసుకెళ్లి.. భోజనం పెట్టి.. తన కుమార్తె.. కుమారుడు (మైనర్ బాలుడు)తో కలిసి చిన్నారి ముక్కు.. నోరు గట్టిగా మూసి ఊపిరి ఆడకుండా చేసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ లో పడేశారు. మూడు రోజులకు పాప మృతదేహం దొరికింది. ఈ హత్య చిన్నారిపై హత్యాచారం చేసినట్లుగా ప్రచారం జరిగింది.

వైసీపీ నేతలు సీరియస్ వ్యాఖ్యలు షురూ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం పుంగనూరు పర్యటనకు ప్లాన్ చేసుకొని.. ప్రకటనను విడుదల చేశారు. ఇలాంటి వేళ.. చిన్నారిది హత్యాచారం కాదు హత్యగా తేలటం.. దాని వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా తేలటంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ అంశంపై తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించిందని..కేసును కొలిక్కి తెచ్చారని అందుకే జగన్మోహన్ రెడ్డి తన పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.

పనిలో పనిగా కర్నూలులో జరిగిన ఘటనలోనూ ప్రభుత్వం ఇలాంటి శ్రద్ధే కనపరిచి ఉంటే బాగుండేదన్నారు. తమ అధినేత పుంగనూరుకు వస్తారన్న విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ఈ హత్యపై వేగంగా స్పందించినట్లు చెప్పుకున్నారు. తమ అధినేతను పొగుడుకోవటం బాగానే ఉన్నా.. చంద్రబాబు సర్కారు వేగంగా స్పందించిందన్న మాట.. అది కూడా పెద్దిరెడ్డి నోటి నుంచి రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.