చలపతిని బాహ్యప్రపంచానికి చూపిన సెల్ఫీ.. మరోసారి కీ రోల్ పోషించింది!
ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారూ పాతిక మంది వరకూ మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు
By: Tupaki Desk | 22 Jan 2025 8:30 PM GMTఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారూ పాతిక మంది వరకూ మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ చలపతి రూపంలో తగిలిందని చెబుతున్నారు.
అవును... తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ జయరాం (62) మృతి చెందాడు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో బాంబు బ్లాస్ట్ జరిగిన ఘటనకు ప్రధాన సూత్రదారి అని అంటారు. అతనిపై రూ. కోటి రివార్డు ఉంది.
ఈ సమయంలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో చలపతి మృతి చెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఘటనా స్థలంలో నుంచి ఏకే-47, ఎస్.ఎల్.ఆర్., ఇన్సాస్ లాంటి ఆయుధాలతో పాటూ 3 ఐఈడీ (ఇంప్రవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) లను గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాలను రాయ్ పూర్ జోన్ ఐజీ వెల్లడించారు.
ఆ సంగతి అలా ఉంటే... అసలు బాహ్యప్రపంచానికి చలపతి అనే మావోయిస్టు ఎలా ఉంటారనే విషయం తెలియదని చెబుతారు. నేడు చనిపోయిన వ్యక్తి చలపతి అని గుర్తించడం కూడా సాధ్యమయ్యేది కాదని.. అయితే.. ఈ రెండింటినీ సాధ్యమయ్యేలా చేసింది ఒక సెల్ఫీ అని చెబుతున్నారు. ఈ విషయం ఆసక్తిగా మారింది.
వాస్తవానికి... 2016 వరకూ పోలీసులకు చలపతికి సంబంధించిన ఫోటోలేవీ లభించలేదు. అయితే.. అతడు తన భర్య అరుణతో ఓ సెల్ఫీ తీసుకోగా.. అది ఆమె అతడి సోదరుడైన ఆజాద్ కు పంపించింది. అయితే.. 2016లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆజాద్ మరణించాడు. దీంతో.. అతడి వద్ద నుంచి ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.
ఆ ల్యాప్ టాప్ లో తన భర్యతో చలపతి దిగిన సెల్ఫీ ఫోటో లభించింది. ఆ ఫోటో చూసిన తర్వాత చలపతి అనే మావోయిస్టు ఎలా ఉంటాడనే విషయం బాహ్యప్రపంచానికి తెలిసిందని అంటారు. తాజాగా ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టుల్లో మరోసారి చలపతిని గుర్తించడంలో ఆ సెల్ఫీ సహకరించని అంటున్నారు.