Begin typing your search above and press return to search.

రామచంద్రాపురం మంట : తోట త్రిమూర్తులే కీలకం...?

అర్జంటుగా తాడేపల్లికి వచ్చిన తోట త్రిమూర్తులు మిధున్ రెడ్డిని కలసి అన్ని విషయాలు చెప్పారు.

By:  Tupaki Desk   |   24 July 2023 6:15 PM GMT
రామచంద్రాపురం మంట :  తోట త్రిమూర్తులే కీలకం...?
X

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల లో ఇపుడు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణు రెండు వర్గాలుగా విడిపోయరు. ఒకరి మీద మరో వర్గం నిప్పులు చెరుగుతోంది. ఏకంగా బాహాటం అయిపోయారు. కత్తులు దూసుకుంటున్నారు.

మంత్రి వేణు సొంత పార్టీకి చెందిన వారినే బాధ పెడుతున్నారు అని అంటున్నారు. ఈ విషయమే ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఇపుడు అదే మాటను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా చెప్పుకొచ్చారు. అటు పిల్లి ఇటు మంత్రి వేణుల మధ్య రచ్చ సాగుతూండడంతో వైసీపీ అధినాయకత్వం రంగం లోకి దిగింది.

అసలు వాస్తవాలు ఏంటి అన్న సంగతి పూర్తిగా తెలుసుకునేందుకు హై కమాండ్ తరఫున ఎంపీ మిధున్ రెడ్డి రంగం లోకి దిగారు. ఆయన ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల ను పర్యవేక్షిస్తూంటారు. అందుకే ఆయన పిలుపు మీద అర్జంటుగా తాడేపల్లికి వచ్చిన తోట త్రిమూర్తులు మిధున్ రెడ్డిని కలసి అన్ని విషయాలు చెప్పారు.

ఆయన ఒకటే మాట కుండబద్ధలు కొట్టారు. రామచంద్రాపురం లో వైసీపీ పరిస్థితులు ఏమాత్రం బాగులేవని తేల్చేశారు. మంత్రి వేణు ఒంటెద్దు పోకడలు పోతున్నారు అని కూడా అన్నారు. తాను మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితం లో ఉన్నాని, ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని అన్నారు. మంత్రి వేణు వ్యక్తిగతంగా అందరినీ టార్గెట్ చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు.

ఇక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తానూ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నా ఎపుడూ ఈ తరహా రాజకీయమే లేదని కూడా చెప్పారు. ఇపుడు మాత్రం అంతా సీన్ మారిందని, రాజకీయ మైలేజ్ కోసం సొంత ప్రతిష్ట కోసం పార్టీని మంత్రి వేణు బలిపెడుతున్నారు అని మిధున్ రెడ్డికి తోట చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపధ్యం నుంచి చూస్తే కనుక పరిస్థితులు ఇంకా దిగజారుతాయని ఆయన హెచ్చరించడం విశేషం. ఈ పరిస్థితుల లో తాను కూడా ఏ వైపు వెళ్లే పరిస్థితి లేదని తన వర్గానికి చెందిన వారిని ఇబ్బంది పెడతారు అన్న ఆలోచనల తోనే వెనక్కి తగ్గుతున్నాను అని తోట చెప్పుకొచ్చారని టాక్.

మొత్తం మీద తోట త్రిమూర్తులు ఒకటే విషయం చెప్పారని అంటున్నారు. మంత్రి వేణు తన వ్యక్తిగతం కోసం టోటల్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు అనే ఆయన అభియోగం. ఇక తోట త్రిమూర్తులు చెప్పిన మాటల్తో ఏకీభవించిన మిధున్ రెడ్డి త్వరలోనే సీఎం జగన్ తో సమావేశం ఉంటుందని, ఈ విషయాలు అన్నీ ఆయన దృష్టిలో పెడతామని కూడా చెప్పారని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఈ నెల 26న జగన్ అమలాపురం టూర్ ఉంది. అప్పటిలోగా రామచంద్రాపురం ఇష్యూని ఒక కొలిక్కి తీసుకుని వస్తారని అంటున్నారు. మొత్తానికి అటూ ఇటూ వర్గాలు రెండూ మోహరించి ఉన్న వేళ సీనియర్ నేత రామచంద్రాపురం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు వైపు అధినాయకత్వం మొగ్గు చూపుతోందని అంటున్నారు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే రామచంద్రాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ త్రిమూర్తులు అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.