అయోధ్యకు వెయ్యి కి.మీ. దూరంలో మరో రామాలయం ఓపెన్
ఐదు శతాబ్దాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. అయోధ్యలో రామాలయంలోని బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది.
By: Tupaki Desk | 23 Jan 2024 4:40 AM GMTఐదు శతాబ్దాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. అయోధ్యలో రామాలయంలోని బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. యావత్ దేశం ఈ సన్నివేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం.. అందరూ ఈ మహత్ కార్యక్రమంలో పాలు పంచుకోవటం తెలిసిందే. అంగరంగ వైభవంగా సాగిన అయోధ్య రాములోరి ప్రాణప్రతిష్ట జరిగిన రోజునే.. ఈ పట్టణానికి సుమారు వెయ్యి కి.మీ. దూరంలోని టెంపుల్ సిటీలో మరో రామాలయాన్ని ప్రారంభించారు. అయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సమయంలోనే ఇక్కడా రామాలయాన్ని స్టార్ట్ చేయటం ఒక ప్రత్యేకతగా చెప్పాలి. ఇంతకూ.. ఈ రామాలయాన్ని ఎక్కడ ప్రారంభించారంటే.. దానికి సమాధానం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ సమీపంలో దీన్ని ప్రారంభించారు.
స్థానికులు సొంతంగా చందాలు వేసుకొని నిర్మించిన ఈ రామాలయానికి బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భువనేశ్వర్ నగరానికి సమీపంలోని నయాగఢ్ జిల్లాకు చెందిన ఫతేగఢ్ లో ఈ రామాలయాన్ని నిర్మించారు. 165 అడుగుల ఎత్తు.. 73 అడుగుల పొడవు ఉన్న ఈ రామాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. దాదాపు 150 మంది కార్మికులు ఏడేళ్లుగా కష్టపడి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
సముద్ర మట్టానికి దాదాపు 1800 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ రామాలయం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని వందలాది మంది ఆలయాన్ని సందర్శించుకున్నారు. రామాలయాన్ని నిర్మించిన ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కరవు పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ప్రజలంతా ఒకచోటుకు చేరి పూజలు చేస్తే.. వర్షాలు కురుస్తాయన్నది ఒక నమ్మకం. అందుకే.. ఈ ప్రాంతాన్ని గిరి గోవర్ధన్ గా పిలుస్తుంటారు. ప్రముఖ ఆలయమైన కోణార్క్ టెంపుల్ ను పోలి ఉండేలా ఈ రామాలయాన్ని రి్మించారు. ఈ ఆలయం చుట్టు పలు ఉప ఆలయాల్ని నిర్మించటం మరో విశేషం. మొత్తంగా అయోధ్యలోని రామాలయంలో రాములోరి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ముహుర్తంలోనే.. ఈ రామాలయాన్ని ప్రారంభించటం విశేషంగా చెప్పక తప్పదు.