సీమరాజాకు లోకేష్ ప్రోత్సాహం... అంబటి రాంబాబు ఘాటు విమర్శలు!
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.. ఘాటు విమర్శలు చేశారు.
By: Tupaki Desk | 6 Dec 2024 12:10 PM GMTఏపీలో టీడీపీ, వైసీపీ ల మధ్య రెగ్యులర్ గా ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంటుందనే చర్చ నడుస్తుంటుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఫోటోలు మార్ఫింగ్ చేసుకుని మరీ విమర్శలు చేసుకుంటుంటారు! ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.. ఘాటు విమర్శలు చేశారు.
అవును... తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ఎక్స్ హ్యాండిల్ పై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా టీడీపీ చేస్తున్న పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ అకౌంట్ తో పాటు ఓ యూట్యూబ్ ఛానల్ పైనా గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన అంబటి... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీమరాజా అనే పేరుతో నడుస్తున్న యూట్యూబ్ లో అసభ్య పదజాలంతో ధూషిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి జగన్ పై చాలా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని అంబటి అన్నారు.
యూట్యూబ్ లో సీమరాజా అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకొని పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. ఇలాంటివి మానుకోవాలని తాను ఇప్పటికే చెప్పానని.. వాటిని ఆపకపోగా లోకేష్ ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయి దూషిస్తున్నాడని చెప్పారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తమ మనోభావాలు దెబ్బ తినవా.. చంద్రబాబును విమర్శిస్తే మాత్రం వారి మనోభావాలు దెబ్బతింటాయా అని ప్రశ్నించారు. రెండేళ్ల కిందట పెట్టిన పోస్టులను చూపించి తమ కార్యకర్తలను అరెస్ట్ చేసి, నెల రోజులుగా జైల్లో నిర్భందించారని తెలిపారు. అతడిపైనా పోలీసులు చర్యలు తీసుకునే వరకూ పోరాడతామని అంబటి తెలిపారు.
ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే ఈ నెల 17, 18, 19 తేదీల్లో పలు పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు చేశామని.. అయితే ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు! వీటిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు.