చేతులెత్తేసిన తాడిపత్రి ఆర్వో !?
దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వాటి నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Tupaki Desk | 24 May 2024 5:02 PM GMTఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అనంతపురం, చిత్తూరు, పల్నాడు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వాటి నుండి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంతటా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆ తర్వాతి పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు విధుల నుండి తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో హింసాత్మక ఘటనల మీద సిట్ దర్యాప్తు కొనసాగుతున్నది.
తాడిపత్రిలో నెలకొన్న ఘటనల నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ రాంభూపాల్ రెడ్డి తన ఆరోగ్యం బాలేదని, తనను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఉన్నతాధికారులను కోరాడు. కానీ కౌంటింగ్ వరకు కొనసాగాలని ఉన్నతాధికారులు కోరారు. అయినా ఆయన అంగీకరించకపోవడంతో చివరకు అధికారులు అనుమతించడంతో ఆయన ఎన్నికల విధుల నుండి రిలీవ్ అయ్యాడు.
కేవలం రెండు రోజుల సెలవు పెట్టినా ఆయన కౌంటింగ్ వరకు విధుల్లో చేరే అవకాశం లేదని తెలుస్తుంది. రాష్ట్రం అంతటా ఆర్వోలు ఇవే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్నికల వరకు ఏమౌతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.