"రాహుల్ గాంధీ హిందువు ఎలా అవుతాడు.. ఆయనకు ఓట్లేయొద్దు"
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ రాందాస్ అథావలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 26 Feb 2025 1:34 PM GMTకాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ రాందాస్ అథావలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న త్రివేణీ సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చిన వారు పుణ్యాత్ములు.. రానివారు పాపాత్ములని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాహుల్ గాంధీ.. హిందువుల కుటుంబంలో జన్మించి.. కనీసం కుంభమేళాలో స్నానం చేసేందుకు రాలేదన్నారు.
ఇలాంటి వారు హిందువులుగా ఎలా చలామణి అవుతారు? అని అథావలే ప్రశ్నించారు. అంతేకాదు.. హిందువులుగా ఉన్న ఓటర్లు.. ఇక నుంచి రాహుల్‌గాంధీకి ఓటేయరాదని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వారికి ఓటేస్తే.. ఓటు వేసిన వారికి పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. హిందువుల మనోభావాలను కూడా రాహుల్ గుర్తించలేక పోతున్నారని అన్నారు. మరోవైపు.. హిందుత్వ పునాదులపై పుట్టిన శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపైనా అథావలే నిప్పులు చెరిగారు.
హిందూపునాదులపై పుట్టిన శివసేన పార్టీకి చీఫ్‌గా ఉన్న ఉద్దవ్ ఠాక్రేకూడా మహాకుంభమేళాకు రాలేదని.. పుణ్యస్నానం చేయలేదని ఇలాంటివారు రాజకీయాలకు.. హిందువుల తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా అనర్హులని.. వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి కూడా హిందు సోదరులు ఓటేయరాదని.. రాజకీయాలకు దూరంగాఉంచాలని అన్నారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు కాంగ్రెస్‌కు, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు బుద్ధి చెప్పినా.. వీరు తీరు మార్చుకోలేదన్నారు.
ముగిసిన కుంభమేళా..
మరోవైపు మహాకుంభమేళా శివరాత్రి(ఫిబ్రవరి 26)తో ముగిసింది. మొత్తం 45 రోజుల పాటు సాగిన మహా కుంభమేళాకు సుమారు 70 కోట్ల మంది స్నానం చేసేందుకు వచ్చారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది తాము వేసిన అంచనాలను దాటిపోయిందని వివరించింది. భక్తులకు అసౌకర్యం జరగకుండా అనేక ఏర్పాట్లు చేశామని.. ఎంతో మంది సహకరించారని తెలిపింది. కాగా.. శివరాత్రి సందర్భంగా ఒక్క బుధవారమే.. 5 కోట్ల మంది కి పైగా భక్తులు పుణ్యస్నానం చేసినట్టు ప్రభుత్వం వివరించింది.