Begin typing your search above and press return to search.

ఆ బీజేపీ నేతపై అధిష్టానం సీరియస్.. చర్యలకు రెడీ

ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 2:30 PM GMT
ఆ బీజేపీ నేతపై అధిష్టానం సీరియస్.. చర్యలకు రెడీ
X

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఇటీవల బీజేపీ నేత రమేశ్ బిధూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ భగ్గుమన్నారు. రాష్ట్రాల్లోనూ నిరసనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు బీజేపీ అధిష్టానం సైతం స్పందించింది. రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై బీజేపీ అధిష్టానం ఆయనను మందలించినట్లు సమాచారం. అంతేకాకుండా.. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు పలువురు కమలం నేతలు అంటున్నారు.

ఇద్దరు మహిళా నేతలపై తీవ్ర వ్యాఖ్యలపై చేయడంపై బీజేపీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఈ అంశంపై బీజేపీ రెండుసార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే.. రమేశ్ బిధూరి పోటీచేస్తున్న స్థానం నుంచి తప్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. లేదంటే మరో చోటుకు మార్చడంపై బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలోనే కళ్కాజీ నియోజకవర్గం నుంచి బిధూరి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక ఇదే స్థానం నుంచి ఆప్ తరఫున ఢిల్లీ సీఎం అతిశీ పోటీలో నిలిచారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను అక్కడి నుంచి తప్పించి ఓ మహిళను పోటీలో పెట్టాలని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రాథమికంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బలమైన మహిళా నేత కోసం బీజేపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

రమేశ్ బిదూరి ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎంకు ఓ ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును చెబుతున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన అఫ్జల్ గురుకు క్షమాభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ వేశారని ఆరోపించారు. అలాగే.. వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని టార్గెట్ చేస్తూ మరో రకమైన కామెంట్స్ చేశారు. తనను గెలిపిస్తే.. తన నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా తీర్చిదిద్దుతానని అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. ఇక తెలంగాణలో అయితే ఇరు పార్టీల కార్యకర్తలు ఏకంగా కర్రలతో కొట్టుకున్నారు.