Begin typing your search above and press return to search.

పుష్ప బెనిఫిట్ షో కు చలమలశెట్టి రమేశ్ వార్నింగ్.. నాగబాబు ఎంట్రీతో వెనక్కి తగ్గాడు!

అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య నడుస్తున్న ఫైట్ లో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 3:49 AM GMT
పుష్ప బెనిఫిట్ షో కు చలమలశెట్టి రమేశ్ వార్నింగ్.. నాగబాబు ఎంట్రీతో వెనక్కి తగ్గాడు!
X

అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య నడుస్తున్న ఫైట్ లో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం సంచలనంగా మారింది. కొన్నేళ్ల క్రితం తన సినిమా ఫంక్షన్ లో పవన్ మీద అల్లు అర్జున్ చేసిన ఆగ్రహ వ్యాఖ్యలతో మొదలైన ఈ ఫ్యాన్స్ పోరు అంతకంతకూ ముదిరిందే తప్పించి తగ్గింది లేదు. దీనికి పరాకాష్ఠగా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారానికి రావటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడని అల్లు అర్జున్ తీరుపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్నారు.

కట్ చేస్తే.. ఈ గుర్రు అంతకంతకూ పెరగటమే కానీ తగ్గింది లేదు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన పుష్ప2 చిత్రంపై జనసేనకు చెందిన నేత ఒకరు అక్కసు ప్రదర్శించిన వైనం వెలుగు చూసింది. గన్నవరం నియోజకవర్గంలో జనసేన సమన్వయ కర్త చలమలశెట్టి రమేశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2 మూవీకి సంబంధించిన బెనిఫిట్ షో వేసేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. అలా కాకుండా బెనిఫిట్ షో వేసిన పక్షంలో సినిమాను అడ్డుకుంటామని ఓపెన్ గా చెప్పేశారు.

అల్లు అర్జున్ అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడని.. మెగా ఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా ఊరుకోమన్న చలమలశెట్టి రమేశ్ వ్యాఖ్యలు స్థానికంగా పెను సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు సీన్లోకి వచ్చారు. రమేశ్ తో ఫోన్ లో మాట్లాడారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో విడుదలైంది. దీంతో.. వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లైంది.