Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ నుంచి మ‌రో ఎమ్మెల్యే ఔట్‌?

తాజాగా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో చెన్నమనేని రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   14 July 2023 2:30 PM GMT
బీఆర్ ఎస్ నుంచి మ‌రో ఎమ్మెల్యే ఔట్‌?
X

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణలు.. నేత‌ల వ్యూహాలు మారుతున్నాయి. మ‌రికొద్ది మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణలో మూడో సారికూడా ముచ్చ‌ట‌గా అధికారం చేప‌ట్టి.. త‌న స‌త్తా చాటుకోవాల‌ని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బీఆర్ ఎస్ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. దీనికి భిన్నంగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు వ‌డివ‌డిగా మారుతున్నాయి. అధికార పార్టీ బ‌లోపేతం మాట ఎలా ఉన్నా.. నేత‌ల రుస‌రుసలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అసంతృప్తులు మ‌రింత స్ప‌ష్టంగా వినిపిస్తున్నాయి.

రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రెండ్రోజులుగా నిరసన వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ పార్టీని వీడడం గమనార్హం.

ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి సంబంధించి రోజుకో వార్త హాట్ హాట్‌గా తెర‌మీదిక వ‌స్తోంది.

ఇక‌, తాజాగా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో చెన్నమనేని రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కడం తన చేతుల్లో లేదని, అది కేసీఆర్‌ కరుణపై ఆధారపడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకపోతే తన సొంత ప్రణాళికలు ఉన్నాయని రమేష్ పేర్కొన్నారు. అంటే.. ఆయ‌న పొరుగు పార్టీల్లోకి జంప్ చేస్తాన‌ని ప‌రోక్షంగా చెప్పేశారు. లేదా.. స్వ‌తంత్రంగా అయినా పోటీకి సిద్ధ‌మ‌నే సంకేతాలు ఇచ్చారు.

మొత్తంమీద, రమేష్ బాబు మాటల్లో అసంతృప్తి, కోపం స్ప‌ష్టంగా క‌నిపించాయి, ఆయ‌న పార్టీకి రాజీనామా చేసే ఆలోచనను కూడా ఆయ‌న వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. తనకు టిక్కెట్ రాకపోయినా, వేరే పార్టీలో చేరినా గట్టి పోటీదారుగానే ఉంటానని పరోక్షంగా సూచించారు.

ఇదిలావుంటే, 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ త్వరలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతుండగా, ఆ జాబితాలో చోటు ద‌క్కుతుందో.. ద‌క్క‌దో అనే సందేహాలు నాయ‌కుల‌ను ప‌ట్టిపీడిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ద‌క్క‌దు అని ఊహిస్తున్న‌వారు. ముందుగానే పార్టీకి బ‌ల‌మైన సంకేతాలు ఇస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది.