వర్మ వచ్చేశారు.. ఎగ్జిట్ పోల్స్ వేళ.. పోస్టుతో ఏసేశారు
సంచలన దర్శకుడు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. కోరకుండానే కెలికేసే ప్రముఖుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియన తెలుగోడు ఉండదు.
By: Tupaki Desk | 3 Jun 2024 4:31 AM GMTసంచలన దర్శకుడు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. కోరకుండానే కెలికేసే ప్రముఖుడిగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలియన తెలుగోడు ఉండదు. అలాంటి రాంగోపాల్ వర్మ.. గడిచిన కొంతకాలంగా కామ్ గా ఉండటం తెలిసిందే. ఏపీలో జరిగిన హోరాహోరీ ఎన్నికల వేళ ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ దశ పూర్తై.. ఎగ్జిట్ ఫలితాల్ని వెల్లడించిన వేళ.. కాస్త లేటుగా స్పందించారు. ఆ మాటకు వస్తే ఎన్నికల ప్రక్రియ మొదలు కావటానికి కాస్త ముందు నుంచి ఆయన సైలెంట్ గా ఉంటున్నారు. వైసీపీ అధినేత.. ఏపీ సీఎం జగన్ మీద తన అభిమానాన్ని ఏ సందర్భంలోనూ దాచుకోని ఆయన.. ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో తన మద్దతును తెలిపే ప్రయత్నం చేయటం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ వెలువడటం.. మెజార్టీ సంస్థలు మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని.. ఎన్డీయే కూటమికి 370 సీట్లు వచ్చేస్తాయని చెప్పటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలపై ఒకేలాంటి అంచనాలు వ్యక్తం కాగా.. అందుకు భిన్నంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ మరింత కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి. పెద్ద ఎత్తున సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంటూ వెలువరించిన అంచనాలు మరింత గందరగోళానికి.. కొత్త టెన్షన్ కు కారణమయ్యేలా చేశాయని చెప్పాలి.
అందరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విన్నాం. మరి.. వర్మ ఏం చెప్పారు? అన్న క్వశ్చన్ కు సమాధానం చూస్తే.. ఎప్పటిలానే.. ఎవరికి చిక్కని రీతిలో తెలివైన నిర్ణయాన్ని చెబుతున్నట్లుగా విషయాన్ని ఫన్నీ చేసేశారు. తన అంచనాను చెప్పని ఆయన.. ఎక్స్ లో ఒక నెటిజన్ పోస్టు చేసిన పోస్టును రీట్వీట్ చేస్తూ.. అదే తన అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇంతకూ సదరు నెటిజన్ అంచనాను చూస్తే.. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ.. టీడీపీ కూటమి 0-175 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చన్నారు. అదే సమయంలో ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 25 ఎంపీ స్థానాల్లో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు 0-25 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చన్నారు.
సిరాశ్రీ పేరుతో ఉన్న ఎక్స్ యూజర్ పెట్టిన పోస్టును ఆర్జీవీ రీట్వీట్ చేస్తూ.. ఇదే అత్యంత కచ్ఛితమైన సర్వే అంచనా అంటూ పేర్కొన్నారు. ఏ సర్వే అంచనా అయినా తప్పు కావొచ్చేమో కానీ.. తన అంచనా మాత్రం నూటికి నూరు శాతం కరెక్టు అవుతుందంటూ పేర్కొన్నారు. ఏమైనా.. వాతావరణం సీరియస్ గా ఉన్న వేళ.. వర్మలాంటోళ్లు చేసే కామెడీ కాస్తంత రిలీఫ్ గా ఉంటుందని చెప్పక తప్పదు.