వర్మ ట్వీట్లు జగన్ సర్కారుకు శాపంగా మారుతున్నాయా?
తాజాగా వర్మ ట్వీట్ల జోరు ఉందన్న మాట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 23 Sep 2023 2:30 PM GMTమనిషి ఎంత చెడ్డోడు అయినప్పటికీ.. అతగాడికి నష్టం జరుగుతున్న వేళ.. బాధితుడిగా మారటం.. అతనిపై సానుభూతి రావటం సహజ ప్రక్రియగా చెప్పాలి. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ఎవరైనా చనిపోయారన్న మాట విన్నంతనే.. అయ్యో పాపం అన్న మాట అందరి నోట నుంచి వస్తుందే తప్పించి.. పోతే పోయాడులే అన్న మాట రాదు. ఈ చిన్న సూత్రాన్ని మేధావి రాంగోపాల్ వర్మ ఎందుకు మిస్ అవుతున్నారు? అత్త తిట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు మంట పుట్టిందన్న సామెతకు తగ్గట్లే.. తాజాగా వర్మ ట్వీట్ల జోరు ఉందన్న మాట వినిపిస్తోంది.
స్కిల్ స్కాం ఆరోపణలతో చంద్రబాబు అరెస్టు.. ఆయన్ను జైలుకు తరలించటం.. జైలు జీవితం కొనసా..గుతోన్న వేళ.. రోజులు గడిచే కొద్దీ.. ఈ వయసులో బాబుకు ఇన్ని కష్టాలేంటి? అన్న మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. జైలు జీవితం పెరిగే కొద్దీ.. ఈ మాటలు కాస్తా.. సానుభూతిగా మారే అవకాశం ఉంది. అరెస్టు కావటం.. ఆ వెంటనే బెయిల్ రావటం.. జైలు నుంచి విడుదల కావటం లాంటి ఎపిసోడ్లతో వచ్చే ప్రతికూలతతో పోలిస్తే.. ఎంతకూ బెయిల్ రాని వైనంపై సానుకూలత పెరగటం ఖాయం.
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ కావటం.. కెమేరాల్లో చక్కగా రికార్డు కావటం.. ఆ వీడియోలు వైరల్ అయిన వేళ.. ఆయన అరెస్టుతో ఎలాంటి సానుభూతి రాలేదు. కానీ.. రేవంత్ అరెస్టు తర్వాత.. వారాల కొద్దీ జైల్లో ఉన్న సందర్భంలోనూ.. కుమార్తె ఎంగేజ్ మెంట్ వేళలో జైల్లో ఉంటూ.. ఆ వేడుకకు హాజరయ్యేందుకు కోర్టును పర్మిషన్ అడిగిన సందర్భంలోనూ అయ్యో పాపం.. వేడుకకు హాజరయ్యే అవకాశం కల్పిస్తే బాగుండన్న మాట పెద్ద ఎత్తున వినిపించటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు చంద్రబాబు ఎపిసోడ్ విషయానికి వస్తే.. స్కిల్ స్కాంలో ఆయన దోషిగా నిలుస్తారా? లేదంటే నిర్దోషిగా బయటకు వస్తారా? అన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు. కానీ..ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిగా ఉన్న ఆయన్ను వీలైనంత వరకు న్యాయ నిబంధనలకు అనుగుణంగా ట్రీట్ చేస్తున్నారన్న భావన ముఖ్యం. అంతే తప్పించి.. జైల్లో ఉంటే మాత్రం ఏం ఇబ్బంది? జైల్లో ఆ మాత్రం ఉండలేరా? లాంటి మాటలు.. జైల్లో దోమలతో ఇబ్బందులకు గురవుతున్నారన్న మాటను.. కామెడీగా తీసి పారేయటం తప్పే అవుతుంది.
78 ఏళ్ల వయసులో.. పద్నాలుగున్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఒక అధినేత.. ఒక స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. జైలుకు వెళితే.. అక్కడ ఆయన ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగేలా పరిస్థితులు ఉండటాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ.. వర్మ తాజా ట్వీట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కోడి కత్తికే చనిపోతారా? అన్న ప్రశ్న వేసినోళ్లు.. దోమలతో చనిపోతారా? అన్న ఎటకారంలో.. వర్మ 'కారం' మిస్ కావటం గమనార్హం.
ఇవాల్టి రోజున జనాల ప్రాణాల్ని తీస్తున్న డెంగ్యూకు కారణం దోమకాటే అన్న విషయం చిన్న పిల్లాడి కూడా తెలిసినప్పుడు.. దోమల్ని కామెడీగా తీసి పారేయటం ద్వారా బాబుపై సానుభూతిని పెంచుతుందన్నది మర్చిపోకూడదు. దోమలతో అంత ఇబ్బంది లేనప్పుడు ప్రతి ఇంట్లో దోమల్ని చంపే బ్యాట్లు.. మస్కిటో కాయిల్స్.. ఆల్ అవుట్.. గుడ్ నైట్ లాంటి మస్కిటో రిప్లెంట్లను ఎందుకు వాడతారు? ఈ చిన్న లాజిక్ ను వర్మ ఎందుకు మిస్ అవుతున్నారు. స్కిల్ స్కాం విషయంలో జగన్ సర్కారు రూల్ పొజిషన్ కు తగ్గట్లే వెళుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. వర్మ చేసే కొంటె ట్వీట్లతో లాభం కంటే నష్టమే ఎక్కువ. చంద్రబాబు మీద సానుభూతి పెరిగేలా ఆయన చేస్తున్న ఎటకారం ట్వీట్లను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.